● 26 నుంచి చినవెంకన్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలు
● 30న ఆలయ కట్టడాలు ప్రారంభోత్సవం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న వైభవాన్ని చాటేలా ఈనెల 26 నుంచి వచ్చేనెల 3 వరకు వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. గురువారం ఆయన తన చాంబర్ లో ఈఈ డీవీ భాస్కర్, ఏఈఓ ఎం.దుర్గారావుతో క లిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చినవెంకన్న బ్రహ్మోత్సవాల విశేషాలు, ఈనెల 30న జరిగే ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ వివరాలను వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. సామాన్య భక్తుల నుంచి వీవీఐపీల వరకు అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం క్షేత్రంలో ఉత్సవ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నా యని అన్నారు. ఉత్సవాల తొలి రోజు 26న స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేయడం, 27న ధ్వజారోహణం, 28న సూర్య, చంద్ర ప్రభ వాహన సేవలు, 29న ఎదుర్కోలు ఉత్సవం, 30న రాత్రి శ్రీవారి తిరుకల్యాణం, వచ్చేనెల 1న రాత్రి రథోత్సవం, 2న చక్రస్నానం, ఆఖరి రోజు 3న ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తామన్నా రు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రథోత్సవాన్ని జరుపుతామని తెలిపారు.
గరుడ ప్రసాదం స్వీకరించాలి
బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి ఆలయంలో జరిగే ధ్వజారోహణ అనంతరం అర్చకులు భక్తులకు ధ్వజ ప్రసాదాన్ని అందిస్తారని ఈఓ తెలిపారు. సంతానం లేని మహిళలు ఈ ప్రసాదాన్ని తింటే పిల్లలు పుడతారన్న నమ్మకం ఉందని, దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారన్నారు.
ప్రారంభోత్సవాలు ఇలా..
ఈనెల 30న దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దేవస్థానానికి రానున్నారని, ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం నిర్వహిస్తారన్నా రు. రూ.12 కోట్లతో విస్తరించిన అనివేటి మండపా న్ని, రూ.12.50 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ను, రూ.4.50 కోట్లతో నిర్మించిన శివాలయం రాజగోపురాన్ని మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు.


