పేరు మోసిన దొంగ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పేరు మోసిన దొంగ అరెస్ట్‌

Apr 24 2026 10:52 AM | Updated on Apr 24 2026 10:52 AM

రెండు రాష్ట్రాల్లో 100కు పైగా కేసులు

ఏలూరు టౌన్‌: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీగా చోరీ కేసుల్లో నిందితుడిగా పేరు మోసిన దొంగ ఏలూరు త్రీటౌన్‌ పోలీసులకు చిక్కాడు. 100కు పైగా చోరీ కేసులు అతడిపై నమోదు కావడం గమనార్హం. నిందితుడిని అరెస్ట్‌ చేసి గురువారం విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. విశాఖలోని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన శీల అనిల్‌కుమార్‌ జల్సాలు, విలాసాలకు అలవాటుపడ్డాడు. కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో చోరీలకు పాల్పడుతుండగా.. కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసు 28/2026ను సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై అప్పారావు దర్యాప్తు చేపట్టారు. కేసును విచారిస్తున్న పోలీస్‌ బృందం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అదుపులోకి తీసుకుంది. విచారణ చేయగా ఏలూరుతోపాటు పలు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడినట్టు అంగీకరించాడు. నిందితుడి నుంచి సుమారు 7 కాసుల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి వస్తువులు, రూ.5 లక్షల నగదు, నేరాలకు వినియోగిస్తున్న రెండు మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవటం ద్వారా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ద్వారకాతిరుమల, మచిలీపట్నం, కొవ్వూరు, సర్పవరం, తెలంగాణలోని సత్తుపల్లి ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో పురోగతి సాధించినట్లేనని డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ చెప్పారు. కేసును ఛేదించి నిందితుడిని పట్టుకోవటంలో ప్రతిభ చూపిన త్రీటౌన్‌ ఎస్సై అప్పారావు, సిబ్బందిని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌, డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement