నిలిచిపోయిన బియ్యం దిగుమతులు
భీమవరం: అన్నదాతలను ఆదుకుంటామంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు అవసరమైన గోనె సంచులను సైతం అందించలేకపోతుంది. రైతులకు అందించే సంచుల్లో ఎక్కువ శాతం చిరిగిపోవడంతో ధాన్యం కారిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో దాళ్వా వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్న సమయంలో గోనె సంచుల సరఫరా ఇబ్బందికరంగా మారింది. జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 2.30 లక్షల ఎకరాల్లో దాళ్వా వరిని పండించారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పంటను గట్టుకు చేర్చుతున్నా ధాన్యం రైసుమిల్లులకు తరలించడానికి అష్టకష్టాలు పడుతున్నారు.
దిగుబడి అంచనా 9.50 లక్షల మెట్రిక్ టన్నులు
జిల్లాలో ప్రస్తుత దాళ్వా సీజన్‌లో 9.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. దీనిలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. దీనికి గానూ దాదాపు 1.90 కోట్ల గోనె సంచులు అవసరమవుతాయని నిర్ణయించగా, కేవలం 1.25 కోట్లు సంచులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీనితో రైస్ మిల్లుల నుంచి రైతులకు ఎక్కువగా చిరిగిన పాత సంచులను మాత్రమే చేరుతుండడంతో పట్టుబడి పట్టిన ధాన్యం చిల్లుల నుంచి కారిపోయి తూకంలో తేడాలు రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గోనె సంచుల విషయంలో గత మూడు సీజన్లుగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్నదాతలను వేధిస్తున్న గోనె సంచుల కొరత
డిమాండ్.. 1.90 కోట్లు.. ఇచ్చింది 1.25 కోట్లు మాత్రమే
జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
రైతులను నుంచి ధాన్యం దిగుమతి చేసుకున్న రైస్‌మిల్లర్లు మరపట్టించిన తరువాత బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోదాములకు పంపిస్తారు. దిగుమతి చేసుకున్న వెంటనే ధాన్యం మరపట్టిస్తే గోనె సంచులు ఖాళీ అయి తిరిగి రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత సీజన్‌లో కేంద్రప్రభుత్వం బియ్యంలో నూక శాతంలో మార్పులు తీసుకురానుండడంతో ఎఫ్‌సీఐ అధికారులు బియ్యం దిగుమతి నిలిపివేశారు. గతంలో బియ్యంలో నూక 15 శాతం ఉన్నా మిల్లర్ల నుంచి బియ్యం దిగుమతి చేసుకునేవారు. అయితే కేంద్రం కొత్తగా నూక శాతాన్ని 10 శాతానికి తగ్గించడం దానికి సంబంధించి ఎఫ్‌సీఐకి పూర్తిగా ఆదేశాలు అందకపోవడంతో మిల్లర్ల నుంచి బియ్యం దిగుమతులు నిలిచిపోయాయని మిల్లర్లు చెబుతున్నారు. దీంతో ధాన్యాన్ని మరపట్టించకపోవడంతో సంచులు ఖాళీ కావడం లేదని అధికారులు సంచులు కోసం ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. మొత్తం మీద కేంద్రప్రభుత్వం నిబంధనలు రాష్ట్రప్రభుత్వ వైఖరి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పూర్తిస్థాయిలో చిరుగులులేని సంచులు సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.


