తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణ పురపాలక సంఘంలో 2025–26 ఆర్ధిక సంవత్సరానికి ఆస్తిపన్ను వసూళ్లలో డిమాండ్ రూ.21.85 కోట్లుకు గానూ కలెక్షన్ రూ.14.83 కోట్లు (67.86 శాతం) వసూళ్లు చేసి ఏపీ రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (విజయవాడ)లో గురువారం 123 పురపాలక సంఘాల మునిసిపల్ కమిషనర్‌ల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఈ అండ్ యూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్, పుర పరిపాలన శాఖ కమిషనర్ అండ్ సంచాలకుడు పి.సంపత్ కుమార్ చేతుల మీదుగా తాడేపల్లిగూడెం మునిసిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబును సన్మానించి అవార్డును అందించారు.
టి.నరసాపురం : స్థానిక పాత పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న ఎల్‌ఈఎఫ్ ప్రార్థనా మందిరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారని, చర్చి సంఘ విశ్వాసులు, పాస్టర్లు అంబేడ్కర్ సెంటర్లో గురువారం రాత్రి ఆందోళన చేపట్టారు. ప్రధాన సెంటర్‌లో బైఠాయించి చర్చి కూల్చివేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంఘానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి జేసీబీ సహాయంతో కూల్చివేశారని ఇది సంఘవిద్రోహ చర్యగా అభివర్ణించారు. చర్చి కూల్చివేత వెనుక కొందరు రాజకీయ నేతలు హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. కార్యక్రమంలో పాస్టర్లు డి.సామ్యూల్ రాజు, రేమల్లి జాషువా, రాజేష్ రావు యోహాను తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: పట్టణంలో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని టూటౌన్ ఎస్సై రామరావు గురువారం విలేకరులకు తెలిపారు. వివరాల ప్రకారం భీమేశ్వరస్వామి కాలనీలో నివాసం ఉంటున్న మిండాల మోజేష్(25) పెయింట్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే ఈ నెల 22న అతనికి స్నేహితులు ఫోన్ చేసినా ఎత్తకపోవడం, ఇంటి తలుపులు వేసి ఉండడంతో రామకృష్ణ అనే వ్యక్తి ఇంటి కిటికిలో చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. దీనిపై నక్కా వరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామరావు తెలిపారు.
కామవరపుకోట: మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తికి చింతలపూడి మెజిస్ట్రేట్ రెండు నెలల జైలు శిక్ష విధించినట్లు తడికలపూడి ఎస్సై వల్లి పద్మ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం కామవరపుకోటలో గురువారం తన సిబ్బందితో వాహనాలు తనిఖీలు చేస్తుండగా కామవరపుకోటకు చెందిన బొల్లి బోయిన పోసి నాగేంద్ర అనే వ్యక్తి వాహనం ఆపి పరీక్షించగా మద్యం తాగినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి చింతలపూడి కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ ఆ వ్యక్తికి 2 నెలలు జైలు శిక్ష, రూ.300 జరిమానా విధించినట్లు ఆమె తెలిపారు.
భీమవరం : ఆకివీడు రైల్వే స్టేషన్ కు సమీపంలో గురువారం గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు భీమవరం రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మృతుని వివరాలు తెలిసిన వారు భీమవరం రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.
ఉండి: బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని యండగండి గ్రామ శివారు ప్రాంతమైన రాయనివానిగూడెంకు చెందిన తంగెళ్ళ వెంకటేశ్వర్లు తన కుమార్తె వివాహ శుభలేఖలు పంచేందుకు ఈ నెల 21న సాయంత్రం 4 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. యండగండి ప్రభుత్వసుపత్రి వద్దకు వచ్చేసరిగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వేగంగా అతడి ని ఢీ కొట్టడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు అతనిని వైద్య చికిత్స నిమిత్తం భీమవరం తరలించారు. అక్కడ ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు ఏఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేస్తున్నారు.


