ఈత విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఈత విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి

Apr 24 2026 6:20 AM | Updated on Apr 24 2026 6:20 AM

బుట్టాయగూడెం: వేసవి వచ్చిందంటే చిన్నారుల్లో ఎక్కడలేని ఆనందం ఉంటుంది. ఏడాది పొడవునా బడిలో చదువుకుంటూ గడిపిన విద్యార్థులు సెలవుల్లో వారి ఉత్సాహంగా గడపాలని కోరుకుంటారు. ముఖ్యంగా పట్టణాల్లో చదివిన విద్యార్థులు తమ స్వగ్రామాలకు వచ్చి వేసవిని ఆశ్వాదిస్తారు. శుక్రవారం నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చారు. అయితే సెలవు రోజుల్లో చిన్నారులు చెరువులు, బావులు, ప్రాజెక్టుల్లో ఈత కొట్టాలని కోరకుంటూ ఉంటారు. అయితే సరదాగా ఈతకు దిగుతున్న చిన్నారులు మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈతపై అప్రమత్తంగా లేకుంటే తల్లిదండ్రులకు గుండె కోత తప్పదంటున్నారు నిపుణులు.

జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

పోలవరం నియోజకవర్గంలో పరిధిలో గిరిజన మండలాల్లో గల గ్రామాల్లో సుమారు 128 చెరువులు ఉన్నాయి. వీటిలో 40 పెద్ద చెరువులు, చిన్న చెరువులు 81 ఉన్నాయి. గుబ్బల మంగమ్మతల్లి జల్లేరు జలాశయం, కొవ్వాడ ప్రాజెక్టు, పోగొండ రిజర్వాయర్‌ ఉన్నాయి. ఆయా చెరువుల్లో, ప్రాజెక్టుల్లో కొంతమేర నీరు ఉంది. అనేక మంది గ్రామాల్లో ఉంటున్న ప్రజలు దుస్తులు ఉతకడానికి వెళ్తుంటారు. అలాగే సరదాగా ఈతకు వెళ్లి మృత్యువాత పడిన సంఘటనలు జరిగాయి.

తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిందే

ఈత రానివారు ఈతకు వెళ్లే ప్రతీ ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కచ్చితంగా మనిషి నీటిలో మునిగిపోకుండా మునగ, కలబంద కట్టెలను కట్టుకోవాలి. ఈత నేర్పిచాలనుకునేవారు ఈత రాని వారి నడుముకు తాడుట్టి గట్టుపై ఒకరు ఉండి ఈత నేర్పించాలి. ఈతకు వెళ్లే వారు తప్పనిసరిగా తమ వెంట మునగ కట్టెలు, ఈత వచ్చిన వారిని వెంట తీసుకుని వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈత రాని వారిని ఈత నేర్చుకుంటున్న వారు ఒక కంట కనిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈత కొట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

● ఈత కోట్టేటప్పుడు శరీర నిర్మాణానికి అనువైన స్మిమింగ్‌ సూట్‌ వేసుకోవాలి.

● తల వెంట్రుకలు తడవ కుండా మాస్క్‌ లాంటిది ధరించాలి.

● నీటిలో తడవటం వల్ల చర్మ సంబంధింత వ్యాధులు రాకుండా వాజిలిన్‌ వంటివి పూసుకోవాలి.

● ముఖాన్ని పైకి ఉంచి ఈదాలి. ఊపిరి పీల్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

● బావి, చెరువులోకి దూకేటప్పుడు కాళ్లు ముందుగా నీళ్లను తాకేలా చూసుకోవాలి. తలకిందులుగా డైవింగ్‌లా దూకడం ప్రమాదం.

● అడుగుభాగంలో బండరాళ్లు, చెరువుల్లో ఎండిన కొమ్మలు ఉంటాయి. అలాంటి వాటిలో లోతును ముందుగా అంచనా వేయకపోతే ప్రమాదం.

● అరగంట కంటే ఎక్కువసేపు ఈత కొట్టకూడదు. గంటల కొద్దీ ఈదడం వల్ల ఊపిరి ఆడదు. ఈతకొట్టే సమయంలో ఇతరులు మునిగిపోయినట్లు గమనిస్తే ఎంతటి నిపుణులైనా ఈత కొట్టేందుకు దూకకూడదు. కర్రలు, తాడు పరికరాల సహాయంతో కాపాడాలి. జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

సరదాకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న విద్యార్థులు, యువకులు

Advertisement
 
Advertisement
Advertisement