యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా

Apr 24 2026 6:20 AM | Updated on Apr 24 2026 6:20 AM

రోజుకో చెరువులో తవ్వకాలు

ముసునూరు : మండలవ్యాప్తంగా మట్టి దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మట్టి దోపిడీ కోసమే మేమున్నాం అన్నట్టుగా అధికార పార్టీకి చెందిన నాయకులు అందరికీ అభయం ఇచ్చేసి, పగలు రాత్రి తేడా లేకుండా అనుమతులతో పని లేకుండా, రోజుకో చెరువులో మట్టిని కొల్లగొడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, నేతల ధనార్జనే ధ్యేయంగా సహజ సంపదైన మట్టిని కొల్లగొడుతూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. నూజివీడు డివిజన్‌కు సబ్‌ కలెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారి ఉన్నప్పటికీ, యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై నియంత్రణ లేదని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

దూరాన్ని బట్టి రేటు

మండల కేంద్రం ముసునూరులోని చోటా నాయకులు రెవెన్యూ, నీటి పారుదల, గనుల శాఖల అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, దూరాన్ని బట్టి ట్రాక్టర్‌ ట్రక్కుకు రూ.800 నుంచి రూ.1000 వరకు రేటు నిర్ణయించి, నల్లచెరువు, ఊర చెరువు, ముత్తర బోయిన కుంటల్లో నుంచి మట్టిని అక్రమంగా తరలించి, విక్రయిస్తూ తమ జేబులు నింపుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏకంగా జేసీబీలు పెట్టి రేయింబవళ్లు తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లతో విలువైన మట్టిని తరలిస్తున్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పేరు చెప్పి, వాణిజ్య అవసరాలకు, భూస్వాముల తోటలు, పొలాలకు వేలాది ట్రాక్టర్ల మట్టి తరలిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్నట్లు పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు. అధికారులు మాత్రం గృహావసరాలు అని చెప్పి, తప్పించుకుంటున్నారే గానీ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చెబుతన్నారు. ఈ తవ్వకాలపై తహసీల్దార్‌ డి.ప్రశాంతిని వివరణ కోరగా, తక్షణం వీఆర్‌ఓను పంపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ముసునూరులో ప్రధాన రహదారి పక్కనే డంప్‌ చేసిన మట్టి

ముసునూరు నల్ల చెరువులో నుంచి మట్టి తరలిస్తున్న దృశ్యం

Advertisement
 
Advertisement
Advertisement