అత్తిలి: మండలంలోని మంచిలి గ్రామం వద్ద గంజాయి తరలిస్తున్న కాళ్ల మండలం జక్కరంగరువుకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు అత్తిలి ఎస్సై కేఎన్ విశ్వనాథ్ గురువారం విలేకరులకు తెలిపారు. పముజుల పవన్‌న్‌కుమార్, ఎజ్జర్ల జీవరాణిలను అరెస్టు చేసి వారి వద్ద 2.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం బుధవారం రాత్రి మంచిలి గ్రామం వద్ద గంజాయి మత్తులో పవన్‌కుమార్ వీరంగం సృష్టించడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారన్నారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు పవన్‌కుమార్ తో పాటు అతని వెంట ఉన్న జీవరాణిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో వారు విశాఖ జిల్లా పాడేరులో గంజాయి కొనుగోలు చేసి వస్తుండగా మంచిలి వద్ద పవన్‌కుమార్ గంజాయి మత్తులో అలజడి సృష్టించాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


