శ్రీవారి కొండపై గోబర్ధన్‌ ప్లాంట్‌ | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి కొండపై గోబర్ధన్‌ ప్లాంట్‌

Apr 23 2026 7:48 AM | Updated on Apr 23 2026 7:48 AM

ఎన్నో ప్రయోజనాలు

రూ.50 లక్షల ఎస్‌బీఎం 2.0 నిధులతో ఏర్పాటు

గో సంరక్షణ శాలకు గ్యాస్‌, విద్యుత్‌ ఖర్చులు ఆదా

ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం రోజూవారీ ఖర్చులను తగ్గించుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంంది. గతంలో దేవస్థానం అధికారులు కొండపైన పాత గోసంరక్షణశాల వద్ద గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్‌ను నిర్మించి, దాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు. గో వ్యర్ధాల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, నిత్యావసరాలకు వినియోగించేవారు. ధర్మఅప్పారాయ నిలయం (120 గదుల సత్రం)కు ఆ విద్యుత్‌ను సరఫరా చేసేవారు. దాని ద్వారా దేవస్థానానికి ప్రతి నెలా వేలాది రూపాయల విద్యుత్‌ బిల్లు ఆదా అయ్యేది. అభివృద్ధిలో భాగంగా గోసంరక్షణశాలను 2018లో శివాలయానికి సమీపంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి గోపోషణ అక్కడే నిర్వహిస్తున్నారు. పాత గోసంరక్షణ శాల ప్రదేశంలో నిత్యాన్నదాన భవనం, అంబరుఖానా (ప్రసాదాల తయారీ శాల)ను నిర్మించే సమయంలో గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్‌ను తొలగించారు. అప్పటి నుంచి గో వ్యర్ధాలను సేంద్రీయ ఎరువుగా మార్చి, వేలం ద్వారా విక్రయించి, వచ్చిన ఆదాయాన్ని దేవస్థానానికి జమ చేసేవారు.

1.0 టీపీడీ సామర్ధ్యంతో..

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ్‌) 2.0 గ్రాంట్‌ రూ.50 లక్షలతో గోసంరక్షణశాల వద్ద నిర్మించిన 1.0 టీపీడీ సామర్ధ్యం గల గోబర్ధన్‌ ప్లాంట్‌ వాడుకలోకి వచ్చింది. దాంతో గోసంరక్షణ శాలలోని 350 గోవుల నుంచి వచ్చే వ్యర్ధాల(పేడ)ను ఈ గోబర్ధన్‌ ప్లాంట్‌కు వినియోగిస్తున్నారు. రోజుకు 500 కేజీల పేడను వేయడం ద్వారా వచ్చే గ్యాస్‌, విద్యుత్‌ను ప్రస్తుతం గోసంరక్షణశాలకు వినియోగిస్తున్నారు.

విద్యుత్‌, గ్యాస్‌ ఆదా

ఆవులు, గుర్రానికి పెట్టే దాణాను ఉడకబెట్టేందుకు మూడు రోజులకు ఒక గ్యాస్‌ సిలెండర్‌ ఖర్చు అయ్యేది. ఈ నూతన గోబర్ధన్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో ఇప్పుడు గ్యాస్‌ సిలెండర్లతో పనిలేకుండా పోయింది. ఆవుల షెడ్లలో నిరంతరాయంగా తిరిగే ఫ్యాన్లకు ఈ ప్లాంట్‌ ద్వారా సరఫరా అయ్యే విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దాంతో విద్యుత్‌ ఖర్చు కూడా ఆదా అవుతోంది.

ఉత్పత్తి సామర్ధ్యం ఇలా

నూతన ప్లాంట్‌ నుంచి రోజుకి బయోగ్యాస్‌ 30–40 క్యూబిక్‌ మీటర్లు, విద్యుత్‌ రోజుకు 60–70 యూనిట్లు, సేంద్రీయ ఎరువు 700–800 కేజీలు ఉత్పత్తి అవుతుంది. ప్లాంట్‌ నుంచి విద్యుత్‌ సరఫరా చేసేందుకు జనరేటర్‌, గ్యాస్‌ను సరఫరా చేసేందుకు కంప్రెషర్‌ను ఏర్పాటు చేశారు. గోసంరక్షణశాల సిబ్బందికి ప్లాంట్‌ నిర్వహణపై అవగాహన కల్పించారు.

గోబర్ధన్‌ గ్యాస్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. కొండపై నిర్మించిన ఈ ప్లాంట్‌ ద్వారా బయోగ్యాస్‌, విద్యుత్‌, సేంద్రీయ ఎరువులు ఉత్పత్తి అవుతున్నాయి. దాంతో గో సంరక్షణ శాలలో గ్యాస్‌, విద్యుత్‌ ఖర్చు అదా అవుతోంది. ఈ ప్లాంట్‌ల ఏర్పాటుతో పర్యావరణం పరిరక్షణ జరుగుతోంది.

– వేండ్ర త్రినాథరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ

Advertisement
 
Advertisement
Advertisement