ఆగిరిపల్లి: స్థానిక బస్టాండ్ ఆవరణలో ఉన్న వాటర్ కూలర్ వద్ద తాగునీరు ఏర్పాటు చేశారు. మంగళవారం ‘నిరుపయోగంగా చలివేంద్రం’ కథనం సాక్షిలో ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి బస్టాండ్ ఆవరణలో తాగునీరు ఏర్పాటు చేశారు.
ఏలూరు(టూటౌన్): వృద్ధుల చట్టాలు, పథకాలపై అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్నప్రసాద్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమ విభాగం వయోవృద్ధుల చట్టాలు, పథకాలపై అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ.. వయోవృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలను రూపొందించారని, పిల్లల నుంచి నిరాదరణకు గురైనప్పుడు సంబంధిత శాఖ అధికారులను గానీ లేదా న్యాయ సేవాధికార సంస్థలను గాని సంప్రదించవచ్చని సూచించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల శాఖ అదనపు డైరెక్టర్ బి.రామకుమార్, న్యాయవాది పి.రత్నరాజు, పోలీసు అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో సమగ్రశిక్ష ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మే నెల 15వ తేదీన సమగ్రశిక్ష ఉద్యోగులు తమ కుటుంబాలతో సహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర వైస్ ఛైర్మన్ వాసా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏలూరు సమగ్రశిక్ష కార్యాలయం వద్ద పాదయాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సమగ్రశిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అందించాలని, హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలని, విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సమగ్రశిక్ష ఉద్యోగులపై చిన్నచూపు తగదని, పెరగని జీతాల గురించి ఎన్నోసార్లు విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం ఇవ్వడంతో పాటు, అనేకసార్లు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరామన్నారు. అయినప్పటికీ ఆయన నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో మే 15వ తేదీన విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుండి మంత్రి నివాసం వరకు తమ ఉద్యోగ భద్రత కోసం పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి రూ.200 నకిలీ దర్శనం టికెట్ల స్కామ్ కేసులో ముగ్గురు నిందితులకు భీమడోలు కోర్టు న్యాయమూర్తి ఎస్.ప్రియదర్శిని నూతక్కి బుధవారం బెయిల్ మంజూరు చేశారు. ఇద్దరికి బెయిల్ నిరాకరించారు. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో గతనెల 15న రూ. 200 నకిలీ టికెట్ల విక్రయాల స్కామ్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు 9 మందిని అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపగా, అందులో నలుగురు నిందితులకు గత మంగళవారం బెయిల్ మంజూరయ్యింది. మిగిలిన ఐదుగురిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఐఎస్‌జే రాజు, ఎం.రమేష్‌కు మినహా మిగిలిన ముగ్గురు నిందితులకు బుధవారం బెయిల్ మంజూరయ్యింది.


