కాలువ గట్టు.. కొల్లగొట్టు ! | - | Sakshi
Sakshi News home page

కాలువ గట్టు.. కొల్లగొట్టు !

Apr 23 2026 7:48 AM | Updated on Apr 23 2026 7:48 AM

తాడిపూడి గట్లను యథేచ్ఛగా తవ్వేస్తున్న మాఫియా పట్టించుకోని అధికారులు

తాడేపల్లిగూడెం రూరల్‌: శివారు భూముల రైతులకు మూడో పంటకు సాగు నీరు అందించేందుకు దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి తాడిపూడి కాలువ నిర్మాణం చేశారు. తాడేపల్లిగూడెం మండలంలోని వీరంపాలెం, జగ్గన్నపేట, వెంకట్రామన్న గూడెం గ్రామాల మీదుగా తాడిపూడి కాలువ ఉంది. కాలువ నీరు ఉప్పొంగిన సమయంలో సమీప పొలాలను ముంచెత్తకుండా కాలువ తవ్విన కంకరను తాడి చెట్టు ఎత్తున గట్లు వేశారు. ప్రభుత్వాలు మారడంతో మైనింగ్‌ బకాసురులు గట్లనే వ్యాపారంగా మార్చుకున్నారు. దీంతో గట్లను రాత్రింబవళ్లు తవ్వేసి కంకరను బయట ప్రాంతాలకు తరలిస్తూ లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. ప్రస్తుతం జగ్గన్నపేట ప్రాంతంలో తాడిపూడి కాలువ గట్లను జేసీబీలతో రేయింబవళ్లు తవ్వేస్తున్నారు. ప్రత్యేకించి రాత్రి సమయాల్లో లైట్ల కాంతుల్లో కంకర గట్లను తవ్వేసి పెద్ద ఎత్తున లారీల్లో తరలిస్తున్నారు. రాత్రి సమయాల్లో లారీల చక్రాలకు బ్రేక్‌లు ఉండటం లేదని, ఇష్టారీతిగా లారీలను నడుపుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ సమయంలో ఏ జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు మిన్నకుండటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారా ? అనే అనుమానాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.

Advertisement
 
Advertisement
Advertisement