కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు (టూటౌన్): జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. కలెక్టరుతో పాటు జాయింటు కలెక్టరు ఎంజె అభిషేక్ గౌడ, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి యల్.దేవకీదేవి, ఇన్‌చార్జి ఆర్డీవో ఐ.కిషోర్ తదితరులు అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన పీజీఆర్‌ఎస్ అర్జీలు, రెవెన్యూ క్లినిక్‌ల్లో వచ్చిన దరఖాస్తులుపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులు క్షుణ్నంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, కాలయాపన చేయకుండా పరిష్కారం చూపాలని అన్నారు. ఏ ఒక్క అర్జీ రీ–ఓపెన్ కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని, అవసరం అయితే క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో 257 అర్జీలను స్వీకరించారు.


