శాశ్వత విధానం రూపొందించాలి
రైతును భాగస్వామిగా చేయాలి
కోకో సిటీ పేరుతో సర్కారు షో
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కోకో కాంక్లేవ్ పేరుతో రెండు రోజులు సదస్సులు నిర్వహించి కోకో రైతులను దేశంలోనే ఆదర్శ రైతులుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం హడావుడి చేసింది. దెందులూరు నియోజకవర్గంలోని రామశింగవరంలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేసి దేశం రామశింగవరం వైపు చూసేలా చేస్తామని ప్రకటించారు. ప్రసంగాలు, ఆర్భాటాలే తప్ప కోకోకు కనీస ధర దక్కేలా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత రెండేళ్లుగా ధర తిరోగమన బాట పట్టి అన్నదాతకు లక్షల్లో నష్టాలను మిగిలిస్తుంటే, ఆదుకోమని తీవ్రస్థాయిలో ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేకపోవడం గమనార్హం.
ఏలూరు జిల్లాలో గత మూడు దశాబ్దాలుగా కోకో సాగు జరుగుతోంది. గోదావరి– కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో జిల్లా ఉండటంతో వాతావరణం పంట సాగుకు పూర్తి అనుకూలంగా ఉంటుంది. దీంతో దేశంలోనే అత్యధికంగా కోకో సాగు జరిగే జిల్లాగా ఏలూరు ఖ్యాతిగాంచింది. జిల్లాలో పామాయిల్, కొబ్బరిలో అంతర పంటగా, అలాగే విడిగానూ కోకోను సాగుచేస్తున్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 46 వేల ఎకరాల్లో సాగు జరుగుతోంది. రెండేళ్ల క్రితం రికార్డు స్థాయి ధరలతో లాభం పొందిన రైతు నేడు ఢీలా పడిపోయాడు. 2024లో కిలో రూ.1040 పలికిన కోకో, ప్రస్తుత సీజన్‌లో కిలో రూ.270 నుండి రూ.300కు అమ్ముడుపోతోంది.
కౌలు రూ.70 వేల నుంచి లక్ష పైమాటే
గత మూడు దశాబ్దాల్లో జిల్లాలో కోకో ప్రస్థానం కొనసాగింది. కిలో రూ.15–20తో మొదలైన ధర 2023లో రూ.900, 2024లో రూ.1,040కి చేరింది. ఐవరీ కోస్ట్, ఘనా దేశాల్లో అత్యధికంగా కోకో సాగు జరుగుతుంది. గత మూడేళ్లలో ఈ రెండు దేశాల్లో ఉత్పత్తి తగ్గడంతో పాటు పంట పాడవడంతో గతంలో భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో కోకో ధర ఎప్పుడైతే జిల్లాలో సగటున రూ.600 దాటిందో, కోకో తోటల కౌలు ధరలను భూ యజమానులు భారీగా పెంచారు. రూ.30 వేల వరకు ఉన్న కోకో తోట కౌలు ధర, ప్రాంతాన్ని బట్టి, దిగుబడిని బట్టి రూ.70 వేల నుండి 1.20 లక్షల వరకు పెరిగిపోయింది. రేటు పూర్తిగా పడిపోవడంతో ఇప్పుడు కోకో రైతు కకావికలమవుతున్నాడు.
ప్రైస్ పాలసీ కావాలి
ఆయిల్ పామ్ ధర నిర్ణయించడానికి ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియో (ఓఈఆర్), అలాగే అంతర్జాతీయ ధరను ప్రామాణికంగా తీసుకుని ప్రతి నెల ఆయిల్ ఫెడ్ మద్దతు ధర నిర్ణయిస్తుంది. అదే తరహాలో కోకో కంపెనీలు కొనుగోలు చేసే బీన్స్‌కు సంబంధించి ధర నిర్ణయం చేయాలని కోకో రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధర రూ. వెయ్యి నుంచి 300లకు పడిపోవడంతో ఏటా రూ.600 కోట్లకు పైగా జిల్లాలో నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా.
ఆరుగాలం శ్రమించి లక్షలాది రూపాయలు రైతు పంటలపై పెట్టుబడి పెడుతున్నాడు. ధర నిర్ణయించే స్వేచ్ఛ రైతుకు ఎంతమాత్రం లేదు. ఈ విధానం మారాలి. పంట పండించే రైతుకు న్యాయం జరిగేలా శాశ్వత విధానం రూపొందించాలి.
– భూక్యా శ్రీనివాస్ నాయక్, రైతు, నామవరం
కోకో పంట ధర నిర్ణయం విషయంలో రైతులు వివక్షకు గురవుతున్నారు. దశాబ్దాలు గడిచినా ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు చేస్తే గానీ గిట్టుబాటు ధర పొందలేని దుస్థితి ఉంది. ధరల స్థిరీకరణలో కోకో రైతులను భాగస్వాములను చేయాలి.
– ఎరుకులపాటి సాంబశివరావు,
రైతు సమాఖ్య రాష్ట్ర నాయకుడు
సిండికేట్ చక్రంలో రైతులు బలి
రెండేళ్ల క్రితం కిలో రూ.1,040.. నేడు రూ.270 మాత్రమే
నాణ్యత పెరుగుతున్నా దక్కని మద్దతు ధర
రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం
జిల్లాలో 46 వేల ఎకరాల్లో కోకో సాగు
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత దాదాపు వంద రోజులకు పైగా కోకో రైతులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద, రాష్ట్ర ఉద్యానవన శాఖ కార్యాలయం వద్ద, కోకో కొనుగోలు చేసే కంపెనీల వద్ద ఆందోళనలు నిర్వహించారు. రైతు నష్టపోకుండా కనీసం గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నుంచి ముఖ్యమంత్రి వరకు అందరినీ కలిసి కోరారు. దీనిపై ఎలాంటి స్పందన లేదు. జనవరిలో ఉద్యానవన శాఖ నిర్వహించిన కోకో కాంక్లేవ్ సదస్సులో హాజరైన మంత్రి, 15 రోజుల్లోగా మద్దతు ధర నిర్ణయించడానికి కమిటీని ఏర్పాటు చేస్తామని, ఈ సీజన్‌లో ఇబ్బందులు లేకుండా చేస్తామని ప్రకటించారు. ఆ హామీని మరిచిపోయి, ఇప్పుడు కొత్తగా రామశింగవరంలోని 500 ఎకరాల అటవీ ప్రాంతంలో కోకో సిటీ ఏర్పాటు చేస్తామంటూ బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడుతున్నారు.


