ప్రభుత్వ నిర్లక్ష్యమే మొక్కజొన్న రైతుకు శాపం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్లక్ష్యమే మొక్కజొన్న రైతుకు శాపం

Apr 19 2026 7:41 AM | Updated on Apr 19 2026 7:41 AM

ప్రభుత్వ నిర్లక్ష్యమే మొక్కజొన్న రైతుకు శాపం డీసీఈబీ కార్యదర్శిగా సురేష్‌ వ్యక్తి అనుమానాస్పద మృతి పరిసరాల పరిశుభ్ర త ప్రధానం

దెందులూరు: ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారని, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దళారుల చేతిలో మోసపోతున్నారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.2,400 ఉండగా, రైతులు రూ.1,400 నుంచి రూ.1,600 మధ్యలోనే అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ రబీలో వరి తర్వాత 12.35 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగిందని, సుమారు 35 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఈ క్రమంలో రైతులు సుమారు రూ.2,500 కోట్ల వరకు నష్టపోతారని అంచనా వేశారు. గతంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మార్క్‌ఫెడ్‌ ద్వారా మూడు సంవత్సరాల్లో సుమారు 8 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసి రైతును ఆదుకున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి దళారుల దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రైతులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/దెందులూరు : జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ (డీసీఈబీ) కార్యదర్శిగా పి.సురేష్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకూ ఆ స్థానంలో తడికలపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏ.సర్వేశ్వరరావు బాధ్యతలు నిర్వహించారు. ఆయన మూడు సంవత్సరాల పదవీ కాలం ముగియడంతో, దెందులూరు మండలం మేదినరావుగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న సురేష్‌ను నియమించారు. సురేష్‌ను జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ, ఏలూరు ఉప విద్యాశాఖాధికారి, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు అభినందించారు.

ఆగిరిపల్లి: మండలంలోని వడ్లమానుకు చెందిన రెడ్డి సులేమాన్‌ రాజు(40) కృష్ణా జిల్లా ఉప్పులూరు వద్ద ఉన్న ఏలూరు కాలువలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సులేమాన్‌ రాజు విజయవాడలోని ఓ ప్రైవేట్‌ బ్యాంకులో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఒక వ్యక్తి దగ్గర కోర్టుకు సంబంధించిన పేపర్లు తీసుకుని వెళ్తూ.. నెక్కలం గొల్లగూడెం వద్ద ఉన్న కూల్‌డ్రింక్‌ షాపు వద్ద ఆగాడు. ఆ తర్వాత నుంచి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయ్యింది. శనివారం ఉదయం ఉప్పులూరు వద్ద ఉన్న ఏలూరు కాలువలో సులేమాన్‌ రాజు మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై గాయాలు ఉండటంతో పాటు, ద్విచక్ర వాహనంలో ఉన్న కోర్టుకు సంబంధించిన పేపర్లు కూడా అదృశ్యమయ్యాయి. దీంతో సులేమాన్‌ రాజును ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

భీమవరం: భీమవరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రపర్చారు. ఈ సందర్భంగా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనారోగ్యం దరి చేరకుండా చూసుకోవచ్చన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో ప్రతినెల మూడో శనివారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్మర్డ్‌ రిజర్వ్‌ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ కెవీవీఎన్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement