కొల్లేరులో ఆక్రమణలు జరగనివ్వం
● చంద్రబాబు ప్రభుత్వంలో పెచ్చుమీరిన తవ్వకాలు
● అడ్డుకున్న అటవీ అధికారుల బదిలీ
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కొల్లేరుకు కూటమి పాలనలో తూట్లు పొడుస్తున్నారు. ముఖ్యంగా కై కలూరు నియోజకవర్గంలో తవ్వుకున్నోడికీ తవ్వుకున్నన్ని చెరువులు. ప్రభుత్వానికి సమాంతరంగా ఇక్కడ చట్టాలు మారిపోతున్నాయి. సుప్రీంకోర్టు నిబంధనులు కొల్లేరులో కలిపేస్తున్నారు. చేపల, రొయ్యల చెరువులు తవ్వాలంటే సవాలక్ష నిబంధనలు ఉన్నాయి. క్యూబిక్ మీటరు మట్టిని తీసినా ప్రభుత్వానికి సీనరేజ్ చెల్లించాలి. ఈ నియోజకవర్గంలో ఇవేమీ పనిచేయవు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా డొంట్‌కేర్.
కూటమి అధికారంలో కొల్లేరు అక్రమార్కులకు పంట పండింది. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు, అటవీ ఉన్నతాధికారుల సమావేశంలో కొల్లేరు నియోజకవర్గాల నాయకులు ఇక్కడ ప్రజల తరఫున మాట్లాడటం, అటవీ అధికారులు కొల్లేరు ప్రజలను వేధిస్తున్నారని ఫిర్యాదులు చేయడం సర్వసాధారణంగా మారింది. ఆనక కొల్లేరులో ఆక్రమణలకు పచ్చజెండా ఊపేస్తున్నారు. ఇది తప్పని చెబుతున్న వారిపై కొల్లేరు ప్రజలతో మా కడుపులు కొడుతోన్నారని తిట్టడానికి రంగంలోకి దించుతున్నారు. మాట వినని అటవీ అధికారులను కొల్లేరు నుంచి పంపించేస్తున్నారు.
చటాకాయలో అక్రమ తవ్వకాలు
కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువుల సాగునకు అడ్డాగా పేరొందిన చటాకాయ గ్రామంలో సమీప భుజబలపట్నంకు చెందిన రైతులు డ్రెయిన్‌కు మరమ్మతులు చేస్తున్నారు. వాస్తవానికి మరమ్మతులకు కాగిత రూపంలో అనుమతులు లేవు. కొల్లేరులో 120 జీవో ప్రకారం అగ్గిపెట్టె తీసుకెళ్ళినా నేరమే. అలాంటిది డ్రెయిన్ల మరమ్మతుల పేరుతో పెద్దపెద్ద గట్లు వేస్తున్నారు. ఇదే అదునుగా చటాకాయ గ్రామస్తులు అక్రమ తవ్వకాలకు తెరలేపారు. అటవీ అధికారులకు ఈ పరిణామం పెద్ద తలనొప్పిగా మారింది.
కొల్లేరులో పాత సీన్ రిపీట్
రాజకీయ నేతల అండతో కొల్లేరులో అక్రమాలు కొనసాగుతున్నాయి. రెండ్రోజులు సద్దుమణిగిన తర్వాత రాత్రి సమయంలో మిగిలిన పని పూర్తి చేసి అక్రమ సాగు చేసేస్తారు. అటవీ అధికారులు పనులు ఆపామని చెప్పుకోడానికి ముందు హడావుడి చేసి ఫొటోలు మీడియాకు పంపుతారు. ఇదే చటాకాయలో జరిగింది. జిల్లా అటవీశాఖ అధికారి శుక్రవారం వచ్చి అక్రమ బోదె పనులు పరిశీలించారు. చర్యలు మాత్రం అంతంతమాత్రమే. గట్లను కొంత తొలగిస్తామని చెబుతున్నారు.
కొల్లేరు అభయారణ్యంలో ఇకపై అక్రమణలను చేయని వ్వం. చటాకాయలో పనులను నిలుపుదల చేశాం. నిబంధనలకు విరుద్ధంగా వేసిన గట్లును కొంత తొలగిస్తాం. పనులు జరగకుండా సిబ్బందితో గస్తీని ముమ్మరం చేస్తాం.
– కె.రామలింగాచార్యులు,
అటవీ శాఖ రేంజర్, కై కలూరు


