ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయ గోపురాలపై మొలి చిన మొక్కల తొలగింపునకు అధికారులు శుక్రవారం చర్యలు చేపట్టారు. రావి, మర్రి మొక్కలతో ఆలయ రాజగోపురాలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయని, శిల్ప సంపద ధ్వంసం కావడానికి కారణం అవుతు న్నాయని సాక్షి దినపత్రికలో శుక్రవారం ‘మొక్క’వోని నిర్లక్ష్యం శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు గోపురాలపై ఉన్న మొక్కల తొలగింపు పనులు చేప ట్టారు. తొలిరోజు ఈ పనులు ముందుకు సాగలేదు. ప్రధాన(దక్షిణ) రాజగోపురానికి నిచ్చెన వేసుకుని మొక్కలు తొలగించడం సిబ్బందికి సాధ్యం కాకపోవడమే ఇందుకు కారణం.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు విద్యుత్ ఖర్చులను తగ్గించేందుకు చర్యలపై పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులలో అవగాహన కల్పనకు ఈ నెల 18న రాజమహేంద్రవరంలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్టు ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ పీ.సాల్మన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్టార్టప్ సంస్థ ఎలిమెంట్స్ ఎనర్జీ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నామన్నారు.
బుట్టాయగూడెం: మండలంలోని కొవ్వాడ ప్రాజెక్టులో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. నేషనల్ హైవే నిర్మాణానికి అనుమతులు తీసుకున్నామని చెబున్నప్పటికీ కన్నాపురం, కొవ్వాడ, లక్ష్మీపురం గ్రామ సమీపంలోని పలు చోట్లకు మట్టి యథేచ్ఛగా టిప్పర్లతో తోలుతున్నారు. ఉన్నతాధికారులు మట్టి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. భారీ జేసీబీలను ఏర్పాటు చేసి యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నా కనీసం అటువైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం బాధాకరమని పలువురు విమర్శిస్తున్నారు.
చింతలపూడి: మండల న్యాయ సేవ కమిటీ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ మధుబాబు శుక్రవారం స్థానిక సబ్ జైలును సందర్శించారు. సబ్ జైలులో నిందితుల కేసు వివరాలు, అందిస్తున్న ఆహార పదార్థాలు, మంచినీటి సౌకర్యాలు, అనారోగ్యంగా ఉన్నవారికి అందించే వైద్య సదుపాయాలు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయంపై ఆరా తీశారు. నిందితుల పట్ల జైలు సిబ్బంది బాధ్యతగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించి, వంటశాల స్టోర్ రూంను తనిఖీ చేశారు.
ఏలూరు(టూటౌన్): జిల్లాలో ఈ నెల 25న జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. పాలిసెట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఏలూరులో 9 కేంద్రాలు, నూజివీడులో 3, జంగారెడ్డిగూడెంలో 3 కేంద్రాలలో పరీక్షలకు 5,278 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు.


