నోట్ల కట్టల కలకలం | - | Sakshi
Sakshi News home page

నోట్ల కట్టల కలకలం

Apr 18 2026 7:41 AM | Updated on Apr 18 2026 7:41 AM

నోట్ల కట్టల కలకలం

నరసాపురం: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో ఓ పాస్టర్‌ ఇంట్లో రూ.2,27,94,000 పోలీసులు స్వాధీనం చేసుకోవడం గోదావరి జిల్లాల్లో సంచలనంగా మారింది. కొద్దినెలల క్రితం వరకూ సాధారణ జీవితం గడిపిన పాస్టర్‌ గంటా జాన్‌ బాబూరావు ఒక్కసారిగా విలాసవంతమైన జీవితంలోకి మారడమే కాకుండా, పెద్ద సంఖ్యలో ఆస్తుల కొనుగోలు చేయడం, ఈ క్రమంలో ఆయన ఇంట్లో కోట్లలో నోట్ల కట్టలు లభ్యం కావడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇంట్లో లభ్యమైన నగదుకు ఆధారాలు చూపని కారణంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నరసాపురం డీఎస్పీ సుధాకర్‌ నేతృత్వంలో రూరల్‌ సీఐ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో రెండు బృందాలు విస్తృతంగా దర్యాప్తు చేపట్టాయి. శుక్రవారం ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. జాన్‌ బాబూరావు నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. పలు దస్తావేజులు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇటీవల బాబూరావు తనతో పాటు అతని అల్లుడు, కుమార్తె పేరుతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా ఐటీ అధికారులు ప్రాథఽమికంగా గుర్తించారు. తమ వద్ద ఉన్న నగదుకు అన్ని ఆధారాలు ఉన్నట్టు పాస్టర్‌ కుమార్తె ఫోన్‌ ద్వారా ఐటీ అధికారులకు తెలిపినట్టు సమాచారం. లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన జాన్‌బాబూరావు గ్రామంలో చిన్న చర్చి నడిపేవారు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో తన కుమార్తె వివాహం చేశారు. అప్పటి నుంచి పరిస్థితిలో మార్పు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement