తణుకు అర్బన్: ఉపాధి హామీ పనుల్లో కొత్తగా తీసుకువచ్చిన ఫేస్‌యాప్‌ను తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బళ్ళ చిన వీరభద్ర రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని తేతలి గ్రామం కొండయ్య పాలెం రోడ్డులో పని చేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరభద్ర రావు మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు ముఖ గుర్తింపు హాజరు అమలు చేస్తున్న కారణంగా చాలా చోట్ల పని ప్రదేశాల్లో హాజరు నమోదు కాకపోవడంతో అత్యధిక మంది కూలీలు పని కోల్పోయి తిరిగి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు. కూలీలు చేసిన పనికి ఇచ్చే నామమాత్రపు వేతనానికి రెండు పూటలా పని చేయాలని షరతులు విధించడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న విజయవాడ కమిషనర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
ద్వారకాతిరుమల: మండలంలోని తూర్ల లక్ష్మీపురం గ్రామంలో ఓ ఇంటి ప్రహరీ సందులో గంజాయి ప్యాకెట్లు దొరకడం కలకలాన్ని రేపింది. దీనిపై స్థానిక పోలీస్టేషన్‌లో గురువారం రాత్రి కేసు నమోదైంది. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం తూర్ల లక్ష్మీపురంలోని సెనగన శ్రీనివాసరావు ఇంటి వద్ద గంజాయి, మద్యం బాటిళ్లు ఉన్నాయని గుర్తు తెలియని వ్యక్తి 112కి కాల్ చేసి, సమాచారం ఇచ్చాడు. దీంతో ఎస్సై సుధీర్ సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని, శ్రీనివాసరావు ఇంటికి దక్షిణం వైపు ఉన్న ప్రహరీ సందులో ఒక సంచిలో రూ. 40 వేలు విలువ చేసే 40 గంజాయి చిన్న ప్యాకెట్లు (ఒక్కో ప్యాకెట్ బరువు 8 గ్రాములు, మొత్తం బరువు 320 గ్రాములు), అలాగే రూ.6,501 విలువైన 5 విస్కీ (180 ఎంఎల్) బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ జరిపారు. అయితే వీటి గురించి తనకేమీ తెలియదని, కావాలని అదే గ్రామానికి చెందిన సుంకర ఆంజనేయులు అనే వ్యక్తి పెట్టి ఉంటాడని శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశాడు. అనంతరం పోలీసులు గంజాయి, మద్యం బాటిళ్లను మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేశారు.


