ముగిసిన శ్రీనివాసుని కల్యాణ మహోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసునికి జరుగుతున్న కల్యాణ మహోత్సవాలు బుధవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో శ్రీనివాసునికి, పద్మావతి, అండాళ్ అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ యజ్ఞశాలలో హోమాది కార్యక్రమాలను జరిపారు. రాత్రి ఆలయంలో ద్వాదశ కోవెల ప్రదక్షిణలను ఆలయ అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థులు వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి, అమ్మవార్లకు శ్రీ పుష్పయాగోత్సవాన్ని అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో జరిపారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పాలకొల్లు సెంట్రల్: ప్రేమించి పెళ్లి చేసుకున్న నూతన వరుడిపై కత్తితో దాడి చేసిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని 31వ వార్డు క్రిస్టియన్ పేటలో చందక సాయికుమార్, గుడిమెట్ల శ్రీసాయిదుర్గ ఇరువురూ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారు తామిద్దరమూ వివాహం చేసుకుంటామని గత శుక్రవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం నరసాపురంలోని ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం మంగళవారం పెళ్లికూతురు కుటుంబ సభ్యులు వివాహ రిసెప్షన్ ఏర్పాటుచేశారు. ఈ వేడుక జరుగుతుండగా అదే ప్రాంతానికి చెందిన గోగులమండ శ్రీను నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చి వరుడు సాయికుమార్ భుజంపై చేయి వేసి చాకుతో కంఠంపై కోశాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే అప్రమత్తపై శ్రీనును స్టేజీపై నుంచి గెంటివేసి సాయికుమార్‌ను హుటాహుటిన పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణ ఎస్సై జీజే ప్రసాద్ శ్రీనుపై కేసు నమోదు చేశారు. శ్రీనును కోర్టులో హజరుపరచగా జైలుకు తరలించినట్లు తెలిపారు.


