ప్రజలను మభ్యపెడుతున్నారు
డైవర్షన్ పాలిటిక్స్‌తో అరాచకాలు
దాడులు జరుగుతున్నాయ్
స్వామివారు బుద్ధి చెబుతారు
కాపులను అణగదొక్కుతున్నారు
దాడి అమానుషం
ద్వారకాతిరుమల : కూటమి ప్రభుత్వానిది అప్రజాస్వామిక పాలనని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయాన్ని బుధవారం ఉదయం మాజీ హోం మంత్రి తానేటి వనిత, తదితరులతో కలసి ఆయన సందర్శించారు. స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం కాపు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో అంబటి రాంబాబు పాల్గొని మాట్లాడారు. తన ఇంటిపై జరిగిన దాడి ఒక అప్రజాస్వామిక, ఘోరమైన, రాష్ట్రంలో ఎన్నడూ జరుగని సంఘటన అని అన్నారు. ఏడు గంటల పాటు జరిగిన దాడిని పోలీసులు నిశ్చేష్టులై చూశారన్నారు. ఆ తరువాత దాడి చేసిన వారిని స్టేషన్ బెయిల్ ఇచ్చి విడిచిపెట్టారని, తనను మాత్రం అక్రమంగా అరెస్టు చేసి, 18 రోజులు జైల్లో పెట్టారన్నారు. భగవంతుడి దయ, తన కులం మద్దతు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఇలాంటి ఘటనలు చరిత్రలో మళ్లీ జరగకుండా ఉండేలా పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి, తనపై దాడి చేసిన వారికి బుద్ధి వచ్చేలా, శిక్షలు పడేవరకు తాను న్యాయపోరాటం చేస్తానన్నారు. కోర్టుల్లో న్యాయపోరాటం.. మీ సమక్షంలో ధర్మపోరాటం చేసి తీరుతానన్నారు. లేకపోతే తనకు జరిగిన అన్యాయం రేపు మరొకరికి జరుగుతుందన్నారు. తాను ఎవరికీ భయపడేదే లేదని, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం తాను కాపుల్లో పులిలాంటి వాడని అన్నారని అన్నారు.
అందరూ మద్దతు ఇవ్వాలి
ఇంటిపై దాడి చేసినా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినా భరించానని అంబటి రాంబాబు అన్నారు. భరించిన వాటన్నింటికీ న్యాయం పొందాలనే తాపత్రయం, కసి, పట్టుదలతో లాజికల్ పోరాటం చేస్తున్నానని, దానికి కులం మద్దతు, పార్టీ మద్దతు కోరుతున్నానని అన్నారు. ఈ దారుణాలను ఎదుర్కోవడం కోసం చిన్నవెంకన్న సన్నిధిలో ప్రతిజ్ఞ చేశానన్నారు. తనను భయపెట్టడం అంత ఆషామాషీ కాదని, తనకు 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్న వైఎస్సార్ సీపీ అండగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వ దారుణాలను ఎదుర్కోవడం కోసం ఇవాళ చిన్నవెంకన్న సన్నిధిలో ప్రతిజ్ఞ చేశానన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ పోసిన శ్రీలేఖ, రాష్ట్ర యువజన విభాగ సంయుక్త కార్యదర్శి పెద్దిరెడ్డి జ్యోతిశ్రీనివాస్, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి వామిశెట్టి పరమేశ్వరరావు, ఏలూరు ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవి, డిప్యూటీ మేయర్ నూకపేయి సుధీర్‌బాబు, పార్టీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, కార్పొరేటర్ కిలారి దుర్గారావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జాన్ గురునాధ్, బంట్రోతు సురేంద్ర తదితరులున్నారు.
జరిగిన అన్యాయంపై కోర్టుల్లో న్యాయ పోరాటం..
మీ సమక్షంలో ధర్మపోరాటం చేస్తా
పార్టీలకు అతీతంగా ప్రతి కాపు నాయకుడు అండగా నిలవాలి
ఇలానే వదిలేస్తే నాకు జరిగిన అన్యాయం రేపు మరొకరికి జరుగుతుంది
మాజీ మంత్రి అంబటి రాంబాబు
ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది. సీఎంగా ఉన్న వ్యక్తి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. అంబటి రాంబాబును టార్గెట్ చేసి ఆయన ఇంటిపై దాడి చేశారు. కాపు నేత వంగవీటిని చంపించిన పార్టీకి కాపులు మద్దతు ఇవ్వడం సరికాదు.
– తానేటి వనిత, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త
కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని రాద్దాంతం చేశారు. అదంతా డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పీక్ స్టేజ్‌లో ఉంది. ఈరోజు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ సీపీకి 175 కి 175 రావడం ఖాయం.
– పుప్పాల వాసుబాబు, వైఎస్సార్ సీపీ ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని పార్టీల్లో ఉన్న కాపులపై దాడులు జరుగుతున్నాయి. కాపుల మద్దతుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మన చిరకాల శత్రువులకు కాపు కాస్తూ అంబటి రాంబాబుపై దాడి చేయడం సరికాదు. ఆయన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కాపు సైనికుడిపై ఉంది. జగనన్నకు కాపుల మద్దతు పూర్తిగా ఉంటుంది.
– తోట రామకృష్ణ, గోపాలపురం నియోజకవర్గ పరిశీలకుడు
వంగవీటి మోహనరంగా తరువాత కాపుల కోసం పోరాడుతున్న వ్యక్తి అంబటి రాంబాబు. జైల్లో పెట్టినా ఎక్కడా ఆయన అధైర్య పడలేదు. కాపులంతా ఆయన వెంటే ఉంటాం. కూటమి ప్రభుత్వం నీచరాజకీయాలు చేస్తోంది. ఇప్పటికే తిరుమల శ్రీవారి ప్రతిష్ఠను దెబ్బతీశారు. లడ్డూ ప్రసాదంపై విషప్రచారం చేసి చివరకు భంగపడ్డారు. స్వామివారు వారికి తగిన బుద్ధి చెబుతారు.
– వడ్డి రఘురామ్, వైఎస్సార్ సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త
కాపుల అభ్యున్నతికి వంగవీటి మోహనరంగా ఎంతో కృషి చేశారు. ఆ క్రమంలోనే నిరాహార దీక్ష చేస్తున్న ఆయనను కర్కశంగా నరికి చంపారు. అప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎవరు చేయించారనే విషయాలు అందరికీ తెలుసు. మాటకారితనం ఉన్న కాపులను అణగదొక్కుతున్నారు. ముద్రగడను కూడా తొక్కేస్తున్నారు. అంబటి రాంబాబు వెన్నెంటే మనమంతా ఉండకపోతే ఆయన్ను చంపేస్తారు.
– చినమిల్లి వెంకటరాయుడు, వైఎస్సార్ సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి అమానుషం. ఇంట్లో ఉన్న వారిని హత్య చేయాలన్న ఉద్దేశంతోనే పెట్రోల్ బాంబులు వేశారు. అక్రమంగా రాంబాబును అరెస్టు చేసి, జైల్లో పెట్టినా ఆయన భయపడలేదు. ప్రతిపక్షంలో ఉంటూ ఆయన ప్రభుత్వానికి వినిపిస్తున్న స్వరం.. ఒక వరం. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా కాపులు పనిచేయాలి.
– మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ), వైఎస్సార్ సీపీ ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త


