ఉంగుటూరు: గోదావరి కాలువలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఎస్సై సూర్యభగవాన్ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. యర్రమళ్ల గ్రామానికి చెందిన గుండుగొల్లు మావుళ్లు (25) స్థానిక ఐస్ పరిశ్రమల వద్ద ప్యాకింగ్ పని చేస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అతని ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు ఫోను వచ్చింది. నేను నాచుగుంట రేవు వద్ద ఉన్నాను. తీసుకువెళ్లడానికి రమ్మని తెలిపాడు. వెంటనే చిన్నాన్న కొడుకు బయలుదేరి రేవు వద్దకు రాగా అప్పటికే నాచుగుంట వంతెనపై వాటర్‌బాటిల్, చెప్పులు, సెల్ ఫోను కనపించాయిగానీ మావుళ్లు కనిపించలేదు. దీంతో అతడు కాలువలో దూకినట్లు గ్రహించి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. మంగళవారం ఉదయం నుంచి మావుళ్లు కోసం చేబ్రోలు పోలీసులు, భీమడోలు, తాడేపల్లిగూడెం ఫైర్ సిబ్బంది కాలువలో గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటివరకు అతడి ఆచూకీ లభించలేదు. శ్రీకాకుళంకు చెందిన యువతిని మావుళ్లు ప్రేమించాడని, ఆమె ఇతడిని వదిలేసి వెళ్లిపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


