● వర్జీనియా ప్రారంభ ధర పతనం
● తొలి రోజు రూ.265 పలికిన ధర
● ఆందోళన వ్యక్తం చేసిన రైతులు
● గోపాలపురం కేంద్రంలో నిలిచిన వేలం
జంగారెడ్డిగూడెం : వర్జీనియా ప్రారంభ ధరతో రైతులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. గతేడాది అత్యధిక ధర రావడంతో ఈ ఏడాది రైతులు ఉత్సాహంగా సాగు చేపట్టారు. వేలం ప్రారంభం కోసం ఎదురుచూశారు. అయితే ప్రారంభ రోజున ధర పతనమై రూ.265 లభించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
తొలిరోజే ఆందోళన
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్‌ఎల్‌ఎస్ పరిధిలోని 5 వేలం కేంద్రాల్లో బుధవారం వర్జీనియా పొగాకు వేలం ప్రారంభించారు. వేలం ప్రారంభం ముందు పొగాకు బోర్డు ఛైర్మన్ సి.యశ్వంత్‌కుమార్, రీజనల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్, వేలం అధికారులు వై.ప్రశాంత్, గ్రేస్ మార్గరేట్, పొగాకు కంపెనీలు రైతులతో జంగారెడ్డిగూడెంలో చర్చలు జరిపారు. పొగాకు కంపెనీలు ప్రారంభ ధర రూ. 265 మాత్రమే ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. గతేడాది ప్రారంభ ధర కేజీకి రూ.290 ఇచ్చారని, అదే ధర ఇవ్వాలని అధికారులు, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కంపెనీ ప్రతినిధులు తమ యాజమాన్యాలతో మాట్లాడి ప్రారంభ ధర రూ.265కు మించి ఇవ్వలేమని తెగేసి చెప్పారు. రైతులు కొద్ది సేపు సమావేశమై బోర్డు అధికారులతో ప్రారంభ రోజు కాబట్టి వేలం జరుపుతామని, పొగాకు బేళ్లను వేలం కేంద్రంలో ఉంచుతామని స్పష్టం చేశారు. తొలుత అధికారులు, కంపెనీలు అంగీకరించినా అనంతరం పొగాకు కంపెనీలు బేళ్లను తరలించుకున్నారు.
వేలం ఇలా..
జంగారెడ్డిగూడెం–1, కొయ్యలగూడెం వేలం కేంద్రాల్లో ప్రాంరభం రోజున 27 బేళ్లు చొప్పున, దేవరపల్లిలో 18 బేళ్లు, జంగారెడ్డిగూడెం–2 కేంద్రంలో 99 బేళ్లు చొప్పున రైతులు వేలానికి తీసుకువచ్చారు. ప్రారంభ ధర కేజీకి రూ.265 లభించింది. కాగా, గోపాలపురం వేలం కేంద్రంలో 27 బేళ్లు పెట్టగా రైతులు వేలాన్ని నిలిపివేశారు.
ఆదిలోనే రైతుల కన్నెర్ర
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం వేలం కేంద్రంలో బుధవారం పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కాగా ప్రారంభ ధర కేజీ రూ.265 లభించడంతో రైతులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. గతేడాది రూ.295 ప్రారంభ ధర ఉండగా ఈసారి రూ.30 తగ్గించి కొనుగోలు చేశారని, ఏటా పొగాకు సాగుకి రెండింతలు ఖర్చు అవుతుందని రైతు సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలో ప్రారంభ ధర రూ.320 ఉండగా ఎన్‌ఎల్‌ఎస్ పరిధిలోని వేలం కేంద్రాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేయడం రైతుకు అన్యాయం చేయడమే అన్నారు. ఈ నేపథ్యంలో కొనుగోళ్లు అడ్డుకోవడంతో వేలం ప్రక్రియ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న బోర్డు చైర్మన్ ిసీహెచ్ యశ్వంత్ కుమార్ వేలం కేంద్రం వద్దకు చేరుకొని రైతు ప్రతినిధులతో చర్చలు నిర్వహించారు. మద్దతు ధర లభించే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకు వేలం కేంద్రంలో వేలం జరుగుతున్న దృశ్యం
కొయ్యలగూడెం: వర్జీనియా పొగాకు వేలం కేంద్రంలో ఆందోళన చేస్తున్న రైతులు


