లేబర్‌ కోడ్‌లపై రణభేరి | - | Sakshi
Sakshi News home page

లేబర్‌ కోడ్‌లపై రణభేరి

Feb 12 2026 7:30 AM | Updated on Feb 12 2026 7:30 AM

లేబర్‌ కోడ్‌లపై రణభేరి

లేబర్‌ కోడ్‌లపై రణభేరి

ఏలూరు (టూటౌన్‌): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 12న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కార్మిక, కర్షక వర్గాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. సమ్మెకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల నుంచి పలు సన్నాహాక కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా వాల్‌ పోస్టర్లు, కరపత్రాలు, ప్రచార జాతాలు, గేట్‌ మీటింగ్‌లు, పని ప్రదేశాల్లో కార్మికులను కలవడం, ఆయా సంస్థలకు సమ్మె నోటీసులు ముందుగా అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. చివరిగా ఈ నెల 12న ఏలూరు, భీమవరంలలో భారీ ప్రదర్శనలు, బహిరంగ సమావేశాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. సమ్మెకు రెండు జిల్లాల పరిధిలోని అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ఉద్యోగులు, కర్షకులు, శ్రామికులు సంపూర్ణ మద్దతును తెలిపారు. కార్పొరేట్ల ఒత్తిడితోనే పాలకవర్గం లేబర్‌ కోడ్‌లు అమల్లోకి తెచ్చినట్లు కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కార్మిక వర్గాన్ని మరింత దోచుకోవడానికి ఇప్పుడున్న కార్మిక చట్టాలు అడ్డుగా ఉన్నాయనేది కార్పొరేట్ల విధానం. కార్మిక వర్గానికి ఇప్పుడున్న హక్కులను కూడా తొలగించడమే లేబర్‌ కోడ్‌ల సారాంశం.

కార్మికుల డిమాండ్‌లివే.. 8 గంటల పని విధానం కొనసాగించాలి. గతంలో మాదిరిగా యూనియన్‌ రిజిస్ట్రేషన్‌ ఏడుగురితో చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. ఈఎస్‌ఐ అర్హతను పాత విధానం ప్రకారం 10 మందితో కొనసాగించాలి. కాంట్రాక్ట్‌ కార్మికులకు చట్టాలు వర్తించడానికి పెంచిన 50ను పాత విధానంలో 20కి తగ్గించాలి. 100 మంది కార్మికులు పనిచేసే కంపెనీల మూసివేత లే ఆఫ్‌, లాకౌట్‌లకు ప్రభుత్వ అనుమతి తీసుకుంటే సరిపోయేది. దాన్ని తాజాగా 300 మంది ఉంటేనే అమలు చేస్తాననడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

నేడు సార్వత్రిక సమ్మె

Advertisement
 
Advertisement
Advertisement