హెల్మెట్ ధారణతో ప్రాణరక్షణ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ద్వారా రహదారి ప్రమాదాల నుంచి ప్రాణ రక్షణ పొందవచ్చని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా స్థానిక శాంతినగర్‌లో గురువారం నిర్వహించిన బైక్ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, రహదారి నియమాలు పాటించాలని సూచించారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు రహదారి భద్రత నియమాలపై అవగాహన పెంచేలా పాఠశాల, కళాశాల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఉప రవాణా కమిషనర్ కేఎస్‌ఎంవీ కృష్ణారావు, ఆర్టీఓ శేఖర్, మోటార్ వాహనాల డీలర్లు, అధికారులు పాల్గొన్నారు.


