తెగ తాగేశారు
భారీగా లిక్కర్ ఆదాయం
ఏలూరు టౌన్ : టీడీపీ సర్కారు ప్రజారోగ్యాన్ని పక్కనబెట్టి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. మందుబాబులకు లిక్కర్‌ను నిత్యం అందుబాటులో ఉంచుతోంది. గత రెండేళ్ళుగా జిల్లాలో మద్యం విక్రయాల జోరు పెరిగింది. ఒకవైపు వైద్యసేవలను నిర్లక్ష్యం చేస్తూ...మరోవైపు సంక్షేమాన్ని పక్కనబెట్టింది. కేవలం ఆదాయమే పరమావధిగా టీడీపీ నేతలు మద్యం విక్రయాలను భారీగా పెంచేశారు. ప్రతి లిక్కర్ షాపుకు అనుసంధానంగా సిట్టింగ్ రూమ్‌లు ఏర్పాటు చేసి మరీ మద్యం రోజంతా అందుబాటులో ఉంచుతున్నారు.
ప్రైవేటు మద్యం దుకాణాల యజమానుల పంట పండింది. ఏలూరు జిల్లాలో మద్యం షాపులు మందుబాబులతో కళకళలాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 155 ప్రైవేట్ మద్యం షాపుల్లో మద్యం నిత్యం అందుబాటులో ఉంటోంది. ఏడాది డిసెంబర్‌లో రికార్డు స్థాయిలో మద్యం సేల్స్ జరుగుతున్నాయి. డిసెంబర్ 31న ప్రభుత్వం మద్యం దుకాణాలకు అర్థరాత్రి 12 గంటల వరకూ విక్రయాలకు అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది.
రెండు రోజుల్లో రూ.14.60 కోట్లు
ఏలూరు జిల్లాలో డిసెంబర్ 31, జనవరి 1న అమ్మకాలు ఏటా పెరుగుతున్నాయి. కొత్త సంవత్సరం వేడుకల పేరుతో మందుబాబులు, యువత భారీఎత్తున మద్యం తాగుతున్నారు. ప్రైవేటు మద్యం షాపులకు మందుబాబుల ఉత్సాహం కాసులు కురిపిస్తోంది. 2025 డిసెంబర్ 31, 2026 జనవరి 1న జిల్లాలో ఏకంగా రూ.14.60 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. 31న మద్యం కేసులు –7891, బీర్ల కేసులు – 4286 అమ్మకాలు చేయగా, కొత్త ఏడాది మొదటి రోజున 7234 మద్యం కేసులు, 3985 కేసుల బీర్లు తాగేశారు.
2023 డిసెంబర్‌లో విక్రయాలు – రూ.101.62 కోట్లు
2024 డిసెంబర్‌లో విక్రయాలు – రూ.110.75కోట్లు
2025 డిసెంబర్‌లో విక్రయాలు – రూ.118.26కోట్లు
2023 డిసెంబర్ 31న అమ్మకాలు – రూ. 6.54 కోట్లు
2024 డిసెంబర్ 31న – రూ.7.34కోట్లు
2025 డిసెంబర్ 31న – రూ. 8.12కోట్లు
ఏలూరు జిల్లాలో భారీ ఎత్తున మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో ప్రైవేటు మద్యం షాపులు 155 ఉండగా, మరో 20 బార్లకు లైసెన్సులు మంజూరు చేశారు. ఇక ప్రైవేటు మద్యం దుకాణాల్లో నెలకు సరాసరి రూ.95 కోట్ల నుంచి గరిష్టంగా రూ.118 కోట్ల వరకూ విక్రయాలు చేయడం గమనార్హం. శీతాకాలంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మద్యం సేల్స్ అధికంగా ఉంటే.. వేసవిలో చల్లటి బీర్లు తాగేందుకు మందుబాబులు ఎగబడుతున్నారు. ఏలూరు జిల్లాలో 2025 ఏడాదిలో సరాసరిన రూ.1140 కోట్ల నుంచి రూ.1250 కోట్ల వరకూ మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ సర్కారు మద్యం ఆదాయంపై మాత్రమే దృష్టి పెట్టిందని, ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది.
రెండు రోజుల్లో రూ.14.60 కోట్ల అమ్మకాలు
డిసెంబర్‌లో రూ.118 కోట్ల విక్రయాలు
ఏలూరు జిల్లాలో ఏరులై పారుతోన్న మద్యం


