మార్కెట్‌ యార్డులోనే కలెక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ యార్డులోనే కలెక్టరేట్‌

Jan 8 2026 7:05 AM | Updated on Jan 8 2026 7:05 AM

మార్కెట్‌ యార్డులోనే కలెక్టరేట్‌

మార్కెట్‌ యార్డులోనే కలెక్టరేట్‌

భీమవరం: పట్టణంలో గతంలో ప్రతిపాదించిన వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ఆవరణలో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ నిర్మిస్తారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) స్పష్టం చేశారు. బుధవారం భీమవరంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీంతో కొంతకాలంగా కలెక్టరేట్‌ తరలిపోతుందనే ప్రచారానికి ఆయన తెరదించడంతోపాటు డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు కలెక్టరేట్‌ను ఉండి ప్రాంతానికి తరలించడానికి చేసిన ప్రయత్నాలకు చెక్‌ పెట్టినట్లు భావిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పశ్చిమగోదావరి జిల్లాకు భీమవరం కేంద్రంగా ప్రకటించడంతో తాత్కాలిక కలెక్టరేట్‌ను పట్టణంలోని మల్లితోట ప్రాంతంలోని అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి కుముదవల్లి రోడ్డులోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రూ.100 కోట్లు నిధులు మంజూరుచేసినట్లు ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది ఉండి ఎమ్మెల్యే కలెక్టరేట్‌ను ఉండి నియోజకవర్గానికి తరలించుకుపోడానికి ముమ్మర ప్రయత్నాలు చేశారు. దీంతో శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేనురాజుతో సహా వైఎస్సార్‌సీపీ నాయకులు తరలింపు వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. వామపక్ష పార్టీలు కలెక్టరేట్‌ తరలింపును అడ్డుకుంటామంటూ ఆందోళన నిర్వహించాయి. ఈ నేపథ్యంలో అంజిబాబు ఏఎంసీలోనే కలెక్టరేట్‌ అంటూ స్పష్టం చేయడంతో కలెక్టరేట్‌ తరలింపు వ్యూహానికి చెక్‌ పెట్టినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

స్పష్టం చేసిన ఎమ్మెల్యే అంజిబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement