ఓ కుటుంబానికి విషాదాన్ని మిగిల్చిన చిన్న వివాదం
జంగారెడ్డిగూడెం: పార్టీ విషయంలో భార్యతో ఏర్పడిన ఓ చిన్న వాగ్వివాదం చివరికి ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. కుమార్తె పుట్టినరోజు వేడుకలు జరగాల్సిన ఆ ఇంట తండ్రి మృత్యు ఘంటికలతో కన్నీటి సంద్రమైంది. జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామానికి చెందిన జంగం రాజేష్ (23)కు భార్య ఐశ్వర్య, రెండు సంవత్సరాల కిరణ్య, ఏడాది వయసున్న హిరణ్య ఉన్నారు. గురువారం రెండో కుమార్తె హిరణ్య పుట్టిన రోజు. దీంతో పుట్టిన రోజు వేడుకలు జరిపేందుకు బుధవారం రాత్రి కేక్ విషయంలో, రాజేష్ స్నేహితులకు పార్టీ ఇచ్చే విషయంలో భార్య ఐశ్వర్యతో గొడవ పడ్డాడు. అనంతరం కొద్ది సేపటికి గదిలోకి వెళ్లి రాజేష్ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే రాజేష్‌ను కిందకు దించి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజేష్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పుట్టినరోజు వేడుకల్లో గడపాల్సిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లక్కవరం ఏఎస్సై భాస్కర్ తెలిపారు.


