స.హ. చట్టంపై అవగాహన
ఏలూరు(మెట్రో): సమాచారం పొందే హక్కు ప్రతి పౌరుడుకి ఉందని, ఆర్టీఐ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సీపీఓ సీహెచ్ వాసుదేవరావు పిలుపునిచ్చారు. జిల్లా అర్ధ గణాంక శాఖ ఆధ్వర్యంలో గురువారం అప్పిలేటు అధికారి వాసుదేవరావు, పౌర సమాచార అధికారి బి.శ్రీదేవి నేతృత్వంలో సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ఏలూరు శాఖ కార్యాలయం నుంచి జెడ్పీ కార్యాలయం మీదుగా ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా వాసుదేవరావు, శ్రీదేవి మాట్లాడుతూ ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించి, ప్రభుత్వ కార్యకలాపాలలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దిశగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. సమాచార హక్కు చట్టం పౌరుల సాధికారతకు శక్తివంతమైన సాధనమన్నారు. ఉప గణాంక అధికారులు, సహాయక గణాంక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


