శిక్షణకు కానిస్టేబుళ్లు
ఏలూరు టౌన్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లుగా ఎంపికై న అభ్యర్థులు శిక్షణకు వెళ్తున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సమీపంలోని పోలీస్ కల్యాణ మండపంలో అభ్యర్థుల సర్టిఫికెట్ల తనిఖీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తులు పూర్తిచేసి, సర్టిఫికెట్లు పరిశీలన చేశారు. జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సివిల్ కానిస్టేబుళ్లుగా 132 మంది పురుష, 61 మంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారని, శనివారం ఉదయం 9 గంటలకు ఏలూరు నుంచి శిక్షణకు బయలుదేరి వెళతారని చెప్పారు.


