పోలవరంలో సీఎస్‌ఎంఆర్‌ఎస్ శాస్త్రవేత్తల పర్యటన
పోలవరం రూరల్: పోలవరంలో రెండోరోజు సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్(సీఎస్‌ఎంఆర్‌ఎస్) శాస్త్రవేత్తలు పర్యటించారు. ప్రాజెక్టులోని డయాప్రమ్ వాల్ ప్రాంతంలో వినియోగిస్తున్న కంకరను శాస్త్రవేత్తలు రవి అగర్వాల్, లలిత్ కుమార్ సోలంకి శుక్రవారం పరిశీలించారు. కంకరను సిమెంట్, ఇసుకతో కలిపిన తరువాత నాణ్యత ఎలా ఉందో పరిశీలించారు. ప్రాజెక్టులోని ల్యాబ్‌లో కూడా పరీక్షించారు. కొన్ని నమూనాలను తమ వెంట తీసుకెళ్లి కేంద్ర పరిశోధనాస్థానంలో పరీక్షించేందుకు సేకరించారు. వీరి వెంట జలవనరుల శాఖ ఈఈ డి.శ్రీనివాస్, డీఈఈలు ఉన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థుల్లో స్వీయ అవగాహన, ఆసక్తులు–నైపుణ్యాల గుర్తింపు, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై అవగాహన కోసం 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థుల కోసం జిల్లా స్థాయి కెరీర్ ఎక్స్‌పోను ఈ నెల 20న నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏలూరు జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే.పంకజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర శిక్ష ద్వారా ఈ నెల 15 నుంచి 18 వరకూ జిల్లాలోని అన్ని సెకండరీ పాఠశాలల్లో పాఠశాల స్థాయి కెరీర్ ఫెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించామని, నాలుగు రోజుల పాటు విభిన్న కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. శనివారం ఏలూరులోని డీసీఎంఎస్ గ్రాండ్ కన్వెన్షన్ హాలులో ఈ కెరీర్ ఎక్స్‌పో నిర్వహిస్తున్నామన్నారు. ఎక్స్‌పోలో ఆరోగ్య, ఇంజినీరింగ్, వ్యవసాయం, ఐటీ, బ్యాంకింగ్, వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి, రక్షణ సేవలు, మీడియా, పర్యాటకం వంటి విభిన్న రంగాలకు సంబంధించిన 25–30 కెరీర్ స్టాళ్ళు ఏర్పాటు చేశామన్నారు.


