కూటమిలో భగ్గుమన్న విభేదాలు
ఏలూరు రూరల్: దెందులూరు నియోజకవర్గంలో కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్ చైర్‌పర్సన్, జనసేన నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మిపై టీడీపీ నాయకులు మా టల దాడి చేశారు. జనసేన శ్రేణుల వల్ల దెందులూ రు నియోజకవర్గంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వ స్తుందని దుయ్యబట్టారు. దీనిపై స్పందించిన వెంకటలక్ష్మి టీడీపీ నేతల సెటిల్‌మెంట్ల కారణంగానే ప్రభుత్వ పరువు పోతోందని ఎదురుదాడికి దిగా రు. శుక్రవారం ఏలూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో సచివాలయ ఉద్యోగులు, టీడీపీ నాయకుల సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారి విజయరాజ్ పర్యవేక్షించగా వెంకటలక్ష్మి హాజరయ్యారు. సమావేశంలో అందరూ టీడీపీ నాయకులే కనిపించడంతో ఇది పార్టీ సమావేశమా, ప్రభుత్వ సమావేశమా అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన టీడీపీ మండలాధ్యక్షుడు నంబూరి నాగరాజు ఇది పార్టీ సమావేశం.. ఇష్టమైతే ఉండు, లేకపోతే వెళ్లు అంటూ హూంకరించారు. దీంతో వెంకటలక్ష్మి సమాధానమిస్తూ సమావేశాన్ని పార్టీ కార్యాలయంలో పెట్టుకుంటే బాగుంటుందన్నారు. వెంటనే టీడీపీ నాయకులు ఆమైపె భగ్గుమన్నారు. నేతల రవి మాట్లాడుతూ జనసేన నాయకులు, కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అనగా.. కొల్లేరును సర్వనాశనం చేస్తున్నారని సైదు సత్యనారాయణ దుయ్యబట్టారు. ఇంతలో కొందరు టీడీపీ నాయకులు ప్రభాకర్ వస్తున్నారు, దమ్ముంటే ఉండాలంటూ వెంకటలక్ష్మికి సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన ఆమె ఎవరొచ్చినా భయం లేదంటూ అక్కడే గంట సేపు ఉండి వెళ్లిపోయారు.


