ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి
ఏలూరు (టూటౌన్): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్ చేశారు. ఏలూరు పవర్‌పేటలోని సుందరయ్య గ్రంథాలయం వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఉపాధి హామీ పథకంగా వద్దని.. ఉపాధి హామీ చట్టంగా కొనసాగించాలని, 197 బిల్లును రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం ద్వారా పేదలకు ఉపాధి లభిస్తుందని, ఇప్పుడు కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని పథకంగా మార్చేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా, 60 శాతం కేంద్ర ప్రభుత్వ వా టాగా నిర్ణయించారని, దీని వల్ల ఆయా రాష్ట్రాలపై పెనుభారం పడిందన్నారు. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం నోరెత్తడం లేదన్నారు. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని 197 బిల్లుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పారు. జిల్లా కార్యదరి వర్గ సభ్యుడు పీవీ రామకృష్ణ, నగర కార్యదర్శి పంపన రవికుమార్, మాజీ కౌన్సిలర్ కంది విశ్వనాథం, నగర కమిటీ సభ్యులు ఎం.ఇస్సాక్, జె.గోపి, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎ.శ్యామల రాణి తదితరులు పాల్గొన్నారు.


