294 అర్జీల స్వీకరణ
ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్‌లో సోమ వారం జరిగిన జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరి ష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి అర్జీలు పోటెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వినతులు సమర్పించారు. మొత్తంగా 294 అర్జీలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి, అధికారులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోపు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. జాయింట్ కలెక్టర్ యంజే అభిషేక్ గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం.అచ్యుతఅంబరీష్, డిప్యూటీ కలెక్టర్ ఎల్.దేవకీదేవి పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● దెందులూరు మండలం రామారావుగూడేనికి చెందిన అరిగెల అమరనాథ్ తన 2.44 ఎకరాల పంట భూమి ఆన్‌లైన్ రికార్డుల్లో నమోదు చే యాలని అర్జీ అందించారు.
● నూజివీడు మండలం మొఖాసానరసన్నపాలేనికి చెందిన నువ్వుల రామమోహనరావు రీసర్వేలో తన భూమి 10 సెంట్లు తక్కువ చూపారని, న్యాయం చేయాలని కోరారు.
● బుట్టాయగూడెం మండలం చీమలవారిగూడేనికి చెందిన అన్నిక వెంకటలక్ష్మి తన పట్టా భూమిలో అనుమతి లేకుండా రోడ్డు నిర్మిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
● వేలేరుపాడు మండలం ఒంటిబండ గ్రామానికి చెందిన కుంజా రామకృష్ణ తాము సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇప్పించాలని వినతిపత్రం అందించారు.


