జిల్లా చరిత్రకు సజీవ సాక్ష్యం
ప్రజలకు పండుగ, విద్యార్థులకు విజ్ఞానం
ఎన్నో ఏళ్ళ కృషి ఫలితం
● నేడు ఏలూరులో పురావస్తు మ్యూజియం ప్రారంభం
● పురావస్తు సంపద అంతా ఒకే చోట
● రూ.5 కోట్లతో నిర్మాణం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు నగరంతో పాటు జిల్లాకూ గొప్ప చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వమే మన జిల్లాలో ఆదిమానవుడు నడయాడినట్టు చరిత్ర చెబుతోంది. దానిని పురావస్తు శాఖ నిరూపించింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఆదిమానవుడి ఆనవాళ్లకు స్పష్టమైన ఆధారాలు దొరికాయి. ఆదిమానవుడు వినియోగించిన అనేక ఉపకరణాలను శోధించి సాధించింది. అవి ఇప్పుడు మన కళ్ళముందే ప్రత్యక్షమయ్యాయి. అక్కడి నుంచి రాచరికపు వైభవాన్ని చవిచూసిన ఈ ప్రాంతానికి చెందిన గురుతులను కూడా వెతికిపట్టుకుంది. వాటినీ మన కళ్ళముందుకు తీసుకువచ్చింది. నగరంలో ఏర్పాటు చేసిన పురావస్తు ప్రదర్శన శాలలో ఇవన్నీ సాక్షాత్కరిస్తున్నాయి.
పోలవరం సమీపంలోని రుద్రమకోట ప్రాంతంలో 10 లక్షల సంవ్సరాల నాటి ఆదిమానవుడి సమాధుల్లో లభ్యమైన పనిముట్ల నుంచి పురాతన పూసలు, రాజులు వాడిన కత్తులు, డాళ్ళు, శిరస్త్రాణాల వరకూ ఈ మ్యూజియంలో ఆకర్షిస్తున్నాయి. పురాతన కాలం నాటి రాతి చెక్కడాలు, దేవతా మూర్తుల ప్రతిమలు, వేల ఏళ్ళనాటి బంగారు, వెండి నాణేలు, టెర్రకోట పాత్రలు, పింగాణి పాత్రలు, ఇలా పాత రాతి యుగం నుంచి నవీన శిలా యుగం వరకూ మన చారిత్రక ఆనవాళ్ళు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. దీనితో పాటు మన ప్రాంత సాహిత్య సంపదగా చెప్పుకోవడానికి తామ్ర పత్రాలు, తాళపత్ర గ్రంథాలు, లోహాలతో చేసిన వంట పాత్రలు, కాంస్యంతో చేసిన దేవతామూర్తుల ప్రతిమలు ఇలా అనేక పురాతన వస్తువులు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రదర్శన శాల మనను విష్ణుకుండినులు, ఇక్ష్వాకులు, వేంగి చాళుక్యులు, రెడ్డి రాజులు, నిజాం పాలకుల కాలానికి తీసుకు వెళ్తుందనడంలో సందేహం లేదు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ ప్రదర్శన శాలలో బంగారు అక్షరాలతో లిఖించిన ఖురాన్ గ్రంథం ఆకర్షిస్తోంది.
రూ.5 కోట్లతో నిర్మాణం
ఈ మ్యూజియం ఏర్పాటుకు అప్పటి ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ స్థానిక అగ్రహారంలోని నగరపాలక సంస్థకు చెందిన సుమారు 1500 గజాల స్థలాన్ని కేటాయించగా అప్పటి చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, ఆర్కియాలజీ శాఖ కమిషనర్ జీ. వాణీమోహన్ సహకారంతో రూ.5 కోట్ల నిధులతో నిర్మించారు. కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కాక మొదటి అంతస్తులో సైతం పలు వస్తువులను ఏర్పాటు చేశారు. రాజమండ్రి, కాకినాడల్లోని మ్యూజియంలలో ఉన్న కొన్ని వస్తువులను జిల్లా ప్రజల కోసం ఇక్కడికి తరలించారు.
నేడు అధికారికంగా ప్రారంభం
ఏడాది క్రితమే నిర్మాణం పూర్తి చేసుకున్నా వివిధ సాంకేతిక కారణాలతో అప్పటి నుంచి ఈ పురావస్తు ప్రదర్శన శాల ప్రారంభానికి నోచుకోలేదు. ప్రజలు, విద్యార్థుల అవగాహన కోసం ఏడాది నుంచే సందర్శకులను ఈ ప్రదర్శన శాలకు అనుమతిస్తున్నారు. ఎట్టకేలకు సాంకేతిక ఇబ్బందులన్నింటినీ తొలగించుకుని ఈ మ్యూజియం అధికారికంగా ప్రారంభోత్సవానికి సిద్ధమయింది. ఈ నెల 16 రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మ్యూజియంను అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఏలూరులో మంగళవారం ప్రారంభించనున్న మ్యూజియం నగర ప్రజలకు పండుగగా, విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే ఆలయంగా నిలువనుంది. ఈ మ్యూజియంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం. మ్యూజియంలో ఏర్పాటు చేసిన కొన్ని చిత్రపటాలను క్యూఆర్‌కోడ్ ద్వారా స్కాన్ చేస్తే ఆ పటానికి సంబంధించిన చరిత్ర మన అరచేతిలోకి వస్తోంది. ఈ మ్యూజియంతో ఏలూరు కూడా పర్యాటక ప్రాంతంగా అబివృద్ధి చెందుతుంది. కే.తిమ్మరాజు, పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
ఏలూరు జిల్లా చరిత్రను, ప్రాచీనత్వాన్ని ప్రజలకు వివరించే ఏకై క సాధనమైన మ్యూజియంను ఏలూరులో ఏర్పాటు చేయడానికి పలువురు సామాజికవేత్తలు ఎన్నో ఏళ్ళుగా విశేష కృషి చేశాం. పురావస్తు శాఖాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి, మ్యూజియం నిర్మాణానికి నిధులు విడుదల చేయించడంతో పాటు, వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏలూరుకు చెందిన పురాతన వస్తువులను ఇక్కడకు రప్పించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారం మరువలేనిది. ఇప్పుడు ఈ ప్రాంతానికి చేరువగానే మ్యూజియం అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. బీకేఎస్‌ఆర్ అయ్యంగార్, సామాజిక వేత్త
జిల్లా చరిత్రకు సజీవ సాక్ష్యం
జిల్లా చరిత్రకు సజీవ సాక్ష్యం
జిల్లా చరిత్రకు సజీవ సాక్ష్యం
జిల్లా చరిత్రకు సజీవ సాక్ష్యం


