మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం
నూజివీడు: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పా టు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ఈనెల 12న పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నామని, ప్రజలంతా పాల్గొనాలని కోరారు. వైఎస్ జగన్ పాలనలో 17 ప్రభుత్వ కళాశాలలను తీసుకొస్తే నేడు కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. మెడికల్ కౌన్సిల్ అనుమతినిచ్చిన సీట్లను సైతం సీఎం చంద్రబాబు వెనక్కి పంపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టడమే పనిగా పెట్టుకుందన్నారు. రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తే 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయని, దీంతో రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించే వారి సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. తద్వారా వైద్యుల కొరతను అధిగమించవచ్చన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే పేదలకు ఉచిత వైద్యం దూరమవుతుందన్నారు. ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోందని, అన్నివర్గాలు కలిసి రావాలని కోరారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు శీలం రాము, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, పార్టీ మున్సిపల్ విభాగం అధ్యక్షుడు మలిశెట్టి బాబీ, ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి కంచర్ల లవకుమార్, క్రిస్టియన్ విభాగం జిల్లా అధ్యక్షుడు పిళ్లా చరణ్, కౌన్సిలర్ మీర్ అంజాద్ ఆలీ, నాయకులు పాల్గొన్నారు.


