క్షీరారామం.. ప్రహరీ శిథిలం
● ప్రమాదకరంగా బేడా మండపం ప్రహరీ గోడ
● వర్షాలతో అండలుగా పడిపోతున్న వైనం
● కర్రలను అడ్డుపెట్టిన ఆలయ అధికారులు
పాలకొల్లు సెంట్రల్ : పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రహరీ గోడ శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. ఆలయానికి పడమర వైపు ప్రహరీ గోడ బేడా మండపం వెనుక భాగంలో సుమారు 15 అడుగుల మేర అండలుగా పడిపోయింది. దీంతో ఆలయం వైపు సరస్వతీ దేవి, కుమారస్వామి, మహిషాసురమర్ధినీ విగ్రహాలు ఉండే ప్రాంతంలో బీటలు తీసినట్టుగా కనిపిస్తుంది. ఆలయ అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్రాంతంలో భక్తులు ప్రదక్షిణలు చేయకుండా కర్రలు అడ్డుగా కట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పడమర గోడకు వెలుపల వైపు (గోళి గుంట) పురావస్తు శాఖ పరిధిలో ఉన్న స్థలాన్ని ఆనుకుని ఉన్న ఈ గోడ అండలుగా పడిపోయింది. సుమారు ఆరు నెలల క్రితం పురావస్తు శాఖ అధికారులు ఈ గోళీ గుంటను శుభ్రం చేయించారు. స్థలం ఖాళీగా ఉండడంతో వర్షానికి నీరు ఇంకి గోడ పడిపోయిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయం చుట్టూ ఉండే ఈ బేడా మండ పం ప్రహరీ గోడతో కలిసి ఉంటుంది. మండపానికి లీకేజీలతో పలుచోట్ల వర్షం నీరు కారుతోంది. అలా గే స్వామివారి సోమసూక్తం వద్ద (జనార్దనస్వామి ఆలయం పక్కన ఉన్న) మండపం పరిధిలో మూడు స్తంభాలు పక్కకు ఒరిగిపోయాయి. మండపం లీకేజీలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పురావస్తు, దేవదాయశాఖ అధికారులు ఆలయాన్ని పరిశీలించి పర్వాలేదనడం గమనార్హం. కార్తీకమాసం కావడంతో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆలయ అధికారులు ప్రమాదకరంగా ఉన్న ప్రాంతంలో కర్రలు కట్టారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తే నియంత్రించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది.
గతంలో ఉత్తరం వైపు..
గతంలో ఆలయం ఉత్తరం వైపు దక్షిణామూర్తి, నటరాజస్వామి, బాణాసురుడు, దత్తాత్రేయులు, కాలభైరవుడు, నాగేంద్రుడు విగ్రహాలు ఉన్న ప్రహరీ గోడ వెలుపల వైపు (గోశాల వైపు) పడిపోయింది. దానికి మరమ్మతులు చేసి ప్రహరీ గోడ నిర్మాణం చేశారు. గోడ మొత్తం అడుసుతో కట్టినట్టుగా ఉంది. రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో పంచారామ క్షేత్రానికి రద్దీ ఎక్కువగా ఉంటుందని, బేడా మండపం ప్రహరీ గోడను పునఃనిర్మించాలని భక్తులు కోరుతున్నారు.


