పంట నష్ట నివారణ చర్యలు ఇలా
కై కలూరు : మోంథా తుపాను ప్రభావంతో వరి పొలాల్లో వర్షపు నీరు చేరిన రైతులు నీటిని బయటకు తోడి గింజ మొలకెత్తకుండా 5 శాతం ఉప్పుద్రావణం పిచికారీ చేయాలని కై కలూరు వ్యవసాయశాఖ సహాయసంచాలకులు ఏ.పార్వతీ చెప్పారు. కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో తుపాను దాటికి పంట ఒరిగిన చేలను వ్యవసాయాధికారి విద్యాసాగర్‌తో కలసి బుధవారం పరిశీలించారు. ఏడీ మాట్లాడుతూ కై కలూరు మండలంలో 2,500 వరి విస్తీర్ణానికి 300 ఎకరాలు, కలిదిండి మండలంలో 1,500 ఎకరాలకు 600 ఎకరాల్లో పంట నేలకొరగడం, నీరు చేరడం జరిగిందన్నారు. పూర్తి నష్ట అంచనాలను వేస్తున్నామన్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో 1310, స్వర్ణ, సంపద స్వర్ణ, 1140 రకాలను సాగు చేస్తున్నారన్నారు. పంట నష్ట నివారణ చర్యలపై పలు సూచనలు చేశారు.
రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● వీలైనంత వరకు పొలంలో నిలచిన నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి.
● గింజలు రంగు మారడం, మాగుడు తెగులు, మానిపండు తెగులు వ్యాప్తి నివారణకు ఎకరాకు 200 మి.లీ. ప్రోపికొనజోల్ పిచికారీ చేయాలి.
● వర్షాలు తగ్గిన తరువాత బ్యాక్టీరియా ఎండాకు తెగులు కనిపిస్తే ప్లాంటోమైసిన్ 1మి.లీ/లీటరు, కొసైడ్ (కాపర్ హైడ్రాకై ్సడ్) 2.0 గ్రా/లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
● తక్కువ సమయంలో, ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీకి అందుబాటులో ఉన్న డ్రోన్‌లను ఉపయోగించుకోవాలి.
● నిలిచిఉన్న, పడిపోయిన చేలలో కంకిపై గింజ మొలకెత్తకుండా ఉండటానికి 5 శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాములు కల్లుప్పు / లీటరు నీటికి)కలిపి పిచికారీ చేయాలి.
● నూర్చిన ధాన్యం 2 – 3 రోజులు ఎండ బెట్టడానికి వీలు కాకపోతే కుప్పల్లో గింజ మొలకెత్తడమే కాక రంగు మారి చెడు వాసన వస్తుంది.
● ఇటువంటి పరిస్థితుల్లో నష్టాన్ని నివారించడానికి ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పు,, 20 కిలోల పొడి ఊక లేదా ఎండుగడ్డి కలిపి ధాన్యం పోగు పెట్టడం వల్ల వారం రోజులపాటు గింజ మొలకెత్తకుండా, చెడిపోకుండా నివారించుకోవచ్చు.
● ఎండ కాసిన తరువాత ధాన్యాన్ని ఎండబోసి, తూర్పార బట్టి నిలవ చేసుకోవాలి.


