
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
ద్వారకాతిరుమల: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో సోమవారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మండలంలోని దొరసానిపాడుకు చెందిన కర్రి రామచంద్రరావు (పండు) అక్కడికక్కడే మృతి చెందాడు. పండు గతంలో దాబాను నిర్వహించేవాడు. అది మూత పడటంతో ప్రస్తుతం ద్వారకాతిరుమలలో ఒక షాపును అద్దెకు తీసుకుని రెస్టారెంట్ నడుపుతున్నాడు. నల్లజర్లలో ఓ వ్యక్తి వద్ద క్యాటరింగ్ నగదు తీసుకుని రాత్రి బైక్‌పై స్వగ్రామానికి వెళుతున్నాడు. సర్వీసు రోడ్డు నుంచి జాతీయ రహదారిపైకి వెళుతుండగా, కొవ్వూరు వైపు నుంచి ఏలూరు వైపుకు వెళుతున్న తాడేపల్లిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన పండు అక్కడికక్కడే మృతి చెందాడు.