
పోగొట్టుకున్న బంగారం అప్పగింత
కొయ్యలగూడెం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బంగారం పోగొట్టుకున్న మహిళకు తిరిగి పోలీసులు అందజేశారు. మంగళవారం మువ్వ శ్రీలక్ష్మి జంగారెడ్డిగూడెం బైక్‌పై వెళుతూ ఏడు సవర్ల బంగారు ఆభరణాలు జారవిడుచుకుంది. పోగొట్టుకున్న బ్యాగులో బ్యాంకు పుస్తకాలు, సెల్ ఫోను కూడా ఉండడంతో దాని ద్వారా బ్యాగును పోయిన ప్రాంతాన్ని బయ్యన్నగూడెం సమీపంలో ఉన్నట్లుగా గుర్తించి ఆమెకు అందజేశారు.
ఉండి: ఉండి మండలం అర్తమూరులో ఎస్సీ కాలనీలో సమస్యల తిష్ట అని ఈ నెల 11న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిలిచిన వర్షపు నీటిని పొక్లెయిన్ సాయంతో మళ్లించారు. అవసరమైన ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించి డ్రెయిన్ల తవ్వకం పనులు చేపట్టారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ముసునూరు: గోగులంపాడులోని ఒక ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఎస్సై ఎం.చిరంజీవి తెలిపిన వివరాలు ప్రకారం.. చింతలవల్లి శివారు గోగులంపాడుకు చెందిన ఎలమంచిలి నళినీ కుమారి, జగదీష్ దంపతులు ఆదివారం ఉదయం ఇంటికి తాళం వేసి నూజివీడు పట్టణంలోని బంధువుల ఇంటికి వెళ్ళారు. సోమవారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బెడ్‌రూమ్‌లో ఉన్న బీరువా తెరిచి అందులో దాచి ఉంచిన కాసు బంగారు గొలుసు, 2 వెండి గిన్నెలు, కుంకుమ భరిణె, రూ. 8 వేల నగదు చోరీ చేసినట్లు గమనించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
చాట్రాయి: అక్రమంగా ఆటవీ భూమిని చదును చేస్తున్న జేసీబిని స్వాధీనం చేసుకున్నట్లు ఫారెస్టు రేంజర్ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని చీపురుగూడెం ఫారెస్టులో సోమవారం తెల్లవారుజామన అటవీ భూమిని గుర్తు తెలియని వ్యక్తి జేసీబీతో చదును చేస్తున్నట్లు సమాచారం రావడంతో దాడి చేసి జేసీబిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

పోగొట్టుకున్న బంగారం అప్పగింత