
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
వీరఘట్టం: ఐషర్ వ్యాన్‌లో ఉన్న గోనె సంచులను అన్‌లోడ్ చేసేందుకు వ్యాన్‌కు ఉన్న తాళ్లను విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్‌కు మధ్యలో పడిపోయిన డ్రైవర్ రాజు(35) శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మెయిన్ రోడ్డులో మంగళవారం మృతి చెందాడు. ఎస్సై జి.కళాధర్, స్థానికులు వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి తాడేపల్లిగూడెంకు చెందిన రాజు గోనె సంచులను తీసుకొచ్చాడు. తాళ్లు విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్‌కు మధ్యలో పడిపోయాడు. అక్కడ ఉన్న వారు అతన్ని బయటకు తీశారు. ఇంతలో రాజుకు పిట్స్ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వీరఘట్టం పీహెచ్‌సీకి తీసుకెళ్లగా చనిపోయినట్లు నిర్ధారించారు.
చాట్రాయి: కారు అదుపు తప్పి ఇద్దరిని ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. చనుబండలో మంగవారం రాత్రి నరసింహరావుపాలెం రోడ్డు నుంచి అతివేగంతో వచ్చిన కారు స్థానిక సత్యనారాయణ స్వామి ఆలయం ఎదుట నిలబడిన నాగుల శ్రీను, భీమవరపు మణికంఠను ఢీ కొట్టింది. శ్రీనుకు కాళ్లు విరిగాయి. ఇద్దరినీ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కారు నడిపే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండు ద్వి చక్రవాహనాలపైకి దూసుకెళ్లడంతో అవి దెబ్బతిన్నాయి.
కామవరపుకోట: ఉరి వేసుకుని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో ఈస్ట్ యడవల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. యడవెల్లి గ్రామానికి చోదిమెళ్ళ సురేష్, రాధ దంపతుల కుమారుడు అభినాష్ ఇంటర్ చదువుతూ మధ్యలో ఆపేశాడు. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందగా గమనించిన బంధువులు పోలీసులు సమాచారం అందించారు. ఎస్సై చెన్నారావు సంఘటనా స్థలాన్ని చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.