
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసన
నేడు అంబేడ్కర్ విగ్రహాల వద్ద ధర్నా
ఏలూరు టౌన్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ ఈ నెల 30న ఏలూరు పాతబస్టాండ్ సెంటర్‌లోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉదయం 9.30 గంటలకు నిరసన చేపడుతున్నామని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్ తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్‌తో కలిసి ఆయన సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్, అనుబంధ విభాగాల నాయకులు, దళిత సామాజికవర్గంలోని ప్రజా సంఘాల నేతలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా సామాన్యులు, పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు, వారి పిల్లలు నష్టపోతారని గుర్తు చేశారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చిన ఘనత మాజీ సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని చూడడం సరైన విధానం కాదన్నారు.
ఏలూరు(మెట్రో): ప్రజల నుంచి అందిన అర్జీలను రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమ వారం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ కె.వెట్రిసెల్వితో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకిదేవి, డీఆర్‌డీఏ పీడీ విజయరాజు, సర్వే శాఖ ఏడీ అన్సారీ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి 231 అర్జీలు అందాయి. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించిన తరవాత దరఖాస్తుదారులతో పరిష్కార విధానంపై మాట్లాడి వారి సంతృప్తి స్థాయిని తెలుసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు.
ఏలూరు టౌన్: ఏలూరు ఆశ్రం హాస్పిటల్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కార్డియాలజీ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని వరల్డ్ హార్ట్‌డే వాక్‌థాన్‌ను సోమవారం నిర్వహించారు. నగరంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. వాక్‌థాన్‌లో నగరంలో యువత, వాకర్స్ క్లబ్ సభ్యులు, ఆశ్రం హాస్పిటల్స్ వైద్యులు, కార్డియాలజీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. గుండెను పదిలంగా ఉంచుకోవాలంటూ ప్లకార్డులు, నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మంచి ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం, ఒత్తిడిని జయించేలా యోగా వంటివి చేయటంతో పాటు వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ ఉండాలన్నారు. ఆశ్రం హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఐవీఆర్ తమ్మిరాజు మాట్లాడుతూ.. గుండె వ్యాధులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.
కై కలూరు: అపురూపంగా చూసుకోవాల్సిన కొల్లేరు పక్షులపై ‘విహంగాల స్వర్గంలో వేటగాళ్ల మరణ మృదంగం’ శీర్షికతో పరిశోధనాత్మక కథనం ‘సాక్షి’లో సోమవారం వెలువడిన విషయం పాఠకులకు విధితమే. దీంతో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వీ అటవీ అధికారులపై ఈ ఘటనపై చర్చించినట్లు తెలిసింది. దీంతో అటవీ అధికారులు కలెక్టర్‌కు వివరణ ఇచ్చారు. ఏలూరు వన్యప్రాణి యాజమాన్య ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పి.మోహిని విజయలక్ష్మీ ఈ ఏడాది జూలైలో నిడమర్రు సెక్షన్ పరిధి వెంకట కృష్ణాపురం, ఏలూరు జిల్లా గుడివాకలంక గ్రామాల వద్ద పక్షుల వేటగాళ్లను పట్టుకుని కేసులు నమోదు చేశామని తెలిపారు.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసన