
బలవంతపు భూసేకరణ తగదు
ఏలూరు (టూటౌన్): జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలో నేవీ ఆయుధ డిపో పేరుతో బలవంతపు భూసేకరణ తగదని, ప్రజలు, గిరిజనుల ఆమోదం లేకుండా సర్వే ప్రారంభించడం అన్యాయమని, పంటలు సాగులో లేని భూముల్లో లేదా సమీప అటవీ భూముల్లో ఆయుధ డిపో ఏర్పాటు చేయాలని వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు. ప్రజల ఆమోదం మేరకే ముందుకు వెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.శ్రీనివాస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్.రామ్మోహన్, బీకేఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఐఎఫ్‌టీయు జిల్లా నాయకులు సాలి రాజశేఖర్, గిరిజన సంఘం నాయకులు కారం దారయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్ డాంగే తదితరులు మాట్లాడారు. జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం పంచాయతీ పరిధిలో 1160 ఎకరాలు భూ సేకరణ చేస్తున్నట్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రకటించారని అక్కడ ప్రజలు ఏమాత్రం ఈ భూ సేకరణను అంగీకరించడం లేదన్నారు. ప్రజల అంగీకారం లేకుండా సర్వే ప్రక్రియ ప్రారంభించడం తగదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో అక్కడ ప్రజలు వ్యతిరేకించారని, అప్పటి ప్రభుత్వం ఈ డిపో ఏర్పాటును విరమించుకుందని గుర్తు చేశారు. గిరిజనులు, ప్రజల ఆమోదం లేకుండా నేవీ డిపో ఏర్పాటును అంగీకరించమని నేవీ అధికారులే ప్రకటించారని చెప్పారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవహరిస్తే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
కలెక్టరేట్ ముందు నిరసన