
1న మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు
ఏలూరు(మెట్రో): స్వస్త్ నారీ సశక్త్ అభియాన్‌శ్రీ కింద ఏలూరు కలెక్టరేట్‌లో అక్టోబర్ 1న మహిళా ఉద్యోగులు, వారి కుటుంబంలోని మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి చెప్పారు. కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం వైద్య శిబిరాల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం రూపొందుతుందన్నారు. సమాజంలోని మహిళల ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం కింద మహిళలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వ్యాధులను ముందుగానే గుర్తిస్తే నియంత్రణకు అవకాశం ఉంటుందని, అందుకే ప్రతీ 6 నెలలు లేదా సంవత్సరానికి ఒక్కసారైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. జీఎస్టీ తగ్గింపు ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు ఫలాలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా ఏ వస్తువుపై ఏ మేరకు ధర తగ్గింది అనే విషయాలపై సంబంధిత శాఖలు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు జోలికి వెళ్తే భవిష్యత్తు అంధకారమని, యువత మాదకద్రవ్యాల జోలికి పోకుండా చూడాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్య రహిత జిల్లాగా ఏలూరును రూపొందించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.