
నారికేళం.. ధరహాసం
సైజును బట్టి ధర
ఇంత ధర ఊహించలేదు
కొనేందుకు ఆలోచిస్తున్నారు
స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతిసారి కొబ్బరికాయ కొడుతుంటాను. కానీ ఇంత ధర ఎప్పుడూ చూడలేదు. బాగా చిన్న కాయ రూ. 30, కాస్త పెద్ద కాయ రూ.35 నుంచి రూ.40 చెప్పారు. దేవుడి దగ్గరకు వచ్చి రూ.10, రూ.20 దగ్గర వెనకాడటం ఎందుకని కొబ్బరి కాయ కొన్నాను.
– నరసింహశెట్టి శ్రీనివాసరావు, భక్తుడు, విజయవాడ
శ్రీవారి దర్శనార్ధం క్షేత్రానికి వచ్చాను. కొండపైన దుకాణంలో ఒక్కో కొబ్బరి కాయ రూ.40, రూ.50 చెప్పారు. అంత పెట్టి కొనలేక ఒక్కో కాయకు రూ.30 ఇచ్చి, రెండు చిన్న కాయలను కొనుగోలు చేశాను. మూడు నెలల క్రితం ఈ సైజు కాయ రూ.10 ఉండేది.
– కొల్లి జ్యోతి – భక్తురాలు, విజయనగరం
ద్వారకాతిరుమల : కొబ్బరికాయల ధర మరింత పెరిగింది. దీపావళి, ఆ తరువాత కార్తీకమాసం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొబ్బరి కాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే కనీవినీ ఎరుగని రీతిలో ధరలు పెరగడంతో పలు క్షేత్రాలను సందర్శిస్తున్న భక్తులు కొబ్బరి కాయలు కొనలేక గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం రైతులు వెయ్యి కొబ్బరి కాయలను రూ. 27 వేలకు విక్రయిస్తున్నారు. చిన్నా, పెద్దా, లేత, ముదురు, ఎండు, పచ్చి అనే తేడా లేకుండా అన్ని రకాల కాయలను ఇదే ధరకు అమ్ముతున్నారు. ఇదిలా ఉంటే నెల రోజుల నుంచి రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కొబ్బరి కాయకు రూ.20 ధర రావడాన్ని రైతులు చూడలేదు. అలాంటిది ఊహించని విధంగా ఇప్పుడు ఇంత ధర పలుకుతుండటంతో రైతులు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరుస పండుగలు, ఆ తరువాత కార్తీకమాసం కావడంతో ధర అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే నారికేళం ధర ఇప్పట్లో దిగివచ్చేలా కనిపించడం లేదు.
ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు..
ప్రస్తుతం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు 70 లారీలకు పైగా కొబ్బరి కాయలు గుజరాత్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మద్యప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్‌కు ఎగుమతి అవుతున్నాయి. స్థానికంగా ధరల పెరుగుదలకు ఈ ఎగుమతులు కూడా ఒక కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి డిమాండ్ ఉంటే నెల క్రితమే ఒక్కో కొబ్బరికాయ ధర రూ. 28కు చేరేదని అంటున్నారు.
మొక్కుబడులు వాయిదా..
కోరిన కోర్కెలు తీరడంతో శ్రీవారి క్షేత్రానికి మొక్కులు చెల్లించేందుకు వస్తున్న భక్తులు కొబ్బరి కాయల ధరలను చూసి హడలిపోతున్నారు. ఈ క్రమంలోనే 101, ఆపై కొబ్బరి కాయల మొక్కుబడి ఉన్న పలువురు భక్తులు తమ మొక్కులను వాయిదా వేసుకుంటున్నారు. సామాన్య భక్తులు సైతం అంత ధర పెట్టి కొబ్బరికాయను కొనేందుకు ఆలోచిస్తున్నారు. దాంతో కొందరు వ్యాపారులు కొబ్బరికాయ రేటు చెబితే భక్తులు కొనడం లేదని గ్రహించి, పూజా సామాగ్రితో కలిపి సెట్టు రూ.100కు విక్రయిస్తున్నారు. కొబ్బరికాయల ధరలు మరింతగా పెరిగితే వ్యాపారాలు సాగడం కష్టమేనని అంటున్నారు
పుణ్యక్షేత్రాల్లో వ్యాపారులు ఒక్కో కొబ్బరి కాయను రూ.30 నుంచి రూ.45కు విక్రయిస్తున్నారు. రైతుల నుంచి అన్ని సైజుల కాయలను ఒకే ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు, వాటిని గ్రేడింగ్ చేసి అతి చిన్న కాయను రూ.30కు, మీడియం సైజు కాయను రూ.35 నుంచి రూ. 40కు, పెద్ద కాయను రూ. 45 నుంచి రూ.50కు విక్రయిస్తున్నారు. దాంతో ద్వారకాతిరుమల దివ్య క్షేత్రాన్ని సందర్శిస్తున్న భక్తులు కొబ్బరి కాయలు కొనేందుకు గగ్గోలు పెడుతున్నారు.
వరుస పండుగలతో పెరుగుతున్న కొబ్బరికాయ ధరలు
రైతుల వద్ద వెయ్యి కాయలు రూ. 27 వేలు
క్షేత్రాల్లో సైజును బట్టి రూ.30 నుంచి రూ.50కి విక్రయాలు
ముందెన్నడూ ఇంత ధర లేకపోవడంతో రైతుల హర్షం
కొనేందుకు వెనకాడుతున్న భక్తులు.. తగ్గిన విక్రయాలు
ఎన్నో ఏళ్ల నుంచి కొబ్బరి తోటలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. కొబ్బరి కాయకు ఇంత ధర వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. గతంలో రూ.7 ఉన్న కొబ్బరి కాయ ధర ఇప్పుడు రూ. 27కు చేరింది. ప్రస్తుతం వ్యాపారులు వెయ్యి కాయలను రూ. 27 వేలకు కొంటున్నారు. హోల్‌సేల్ వ్యాపారులు వాటిని రూ. 30 వేలకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.
– మానుకొండ రవి – కొబ్బరి కౌలు రైతు, పంగిడిగూడెం, ద్వారకాతిరుమల మండలం
గతంతో పోలిస్తే కొబ్బరికాయల విక్రయాలు బాగా తగ్గాయి. అంతెందుకు నెలరోజుల క్రితం రూ.20కు అమ్మిన కాయను, ప్రస్తుతం రూ. 30కు అమ్మాల్సి వస్తోంది. లేకపోతే గిట్టుబాటు కావడం లేదు. ధర ఎక్కువగా ఉందంటూ భక్తులు కొబ్బరి కాయలు కొనేందుకు ఆలోచిస్తున్నారు.
– మసిముక్కుల గంగయ్య, కొబ్బరి కాయల వ్యాపారి, ద్వారకాతిరుమల

నారికేళం.. ధరహాసం

నారికేళం.. ధరహాసం

నారికేళం.. ధరహాసం

నారికేళం.. ధరహాసం

నారికేళం.. ధరహాసం