
జగన్ హయాంలోనే సాకారం
జగన్ హయాంలోనే.. ప్రభుత్వ మెడికల్ కాలేజీ శాశ్వత భవనం
ఏడాదిలోనే ఎంబీబీఎస్ క్లాస్‌లకు మెడికల్ కళాశాల సిద్ధం
శాశ్వత కళాశాల పనులూ వైఎస్సార్‌సీపీ హయాంలోనే
కూటమి ప్రభుత్వంలో పనుల జాప్యంతో క్లాస్‌లకు ఇబ్బంది
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు కూటమి సర్కారు యత్నం
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏలూరులో మెడికల్ కాలేజీ నిర్మించారు. మాజీ సీఎం జగన్ జిల్లా ప్రజల కలను నిజం చేస్తూ.. ప్రతి పేదవాడికి అత్యుత్తమ స్థాయి వైద్యచికిత్సలు, సేవలు అందాలనే సంకల్పంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీని తేవడమే కాదు, యుద్ధప్రాతిపదికన భవనాల నిర్మాణం చేపట్టారు. 2023 సెప్టెంబర్ 15న మొదటి ఏడాది ఎంబీబీఎస్ క్లాస్‌లు ప్రారంభమయ్యాయి.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిర్మాణ పనులు ప్రారంభించిన భవనాల వద్ద ఇప్పుడు కూటమి నేతలు ఫొటోలు దిగుతూ ... తమ హయాంలోనే జరిగిందనే రీతిలో ప్రచారం చేసుకోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ హయాంలో నిర్మాణ పనులు ప్రారంభించి 50 శాతం పనులు పూర్తి చేయగా.. కూటమి 15 నెలల పాలనలో మిగిలిన 50శాతం పనులు నేటికీ పూర్తి చేయలేదు. మరోవైపు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు కూటమి సర్కారు కుట్ర చేస్తోంది. దీనిని నిరసిస్తూ ఈ నెల 19న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు.
ఏడాదిలోపే భవన నిర్మాణం
2019 అక్టోబర్ 4న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరు జీజీహెచ్‌కు శంకుస్థాపన చేశారు. అప్పటికే అక్కడ భారీ భవనాలు ఉండడంతో ముందుగా వాటిని తొలగించారు. ఈలోగా కరోనా వైరస్ విలయంతో రెండేళ్ల పాటు కరోనాతో పనులన్నీ నిలిచిపోయాయి. అనంతరం 2022 అక్టోబర్‌లో పాత బస్టాండ్ సెంటర్ సమీపంలో డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద రూ.60 కోట్లతో శరవేగంగా కేవలం ఏడాదిలోపే భవన నిర్మాణం పూర్తి చేశారు. 2023 సెప్టెంబర్ 15న ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభించారు.
కూటమి రాకతో పనుల్లో జాప్యం : కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మెడికల్ కాలేజీ నిర్మాణంలో తీవ్ర జాప్యం ఏర్పడింది. కాంట్రాక్టర్‌ను తొలగిస్తారని, నిధులు విడుదల చేస్తారో లేదో అన్న సందేహాలతో పనులు నత్తనడకన సాగాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా... నేటికీ శాశ్వత భవనం, హాస్టల్స్ భవనాలను పూర్తి చేయలేదు.
తామే కట్టామంటూ కూటమి నేతల ప్రగల్భాలు
ఏలూరు జీజీహెచ్‌లో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనం వద్ద కూటమి నేతలు ఫొటోలు దిగటాన్ని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రయత్నం చేయని సీఎం చంద్రబాబు.. మాజీ సీఎం జగన్ పనులు ప్రారంభించిన భవనాల వద్ద తమ హయాంలోనే అంటూ ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం మూడో ఏడాది ప్రారంభం నాటికై నా పనులు పూర్తి చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
ఈ నెల 19న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
ఏలూరు జీజీహెచ్ ప్రాంగణంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు... కాలేజీ శాశ్వత భవనాలు, పరిపాలన భవనం, విద్యార్థులకు హాస్టల్స్ భవనాలు, అధునాతన బోధనాసుపత్రి(జీజీహెచ్), టీచింగ్, నాన్ టీచింగ్, నర్సింగ్ స్టాఫ్‌కు నివాసాలకు క్వార్టర్లు, అత్యాధునిక సౌకర్యాలతో ల్యాబ్‌లు, ఇలా పూర్తిస్థాయి మెడికల్ కళాశాల తీర్చిదిద్దేందుకు రూ.525 కోట్లు నిధులను మంజూరు చేయించారు. ఏలూరు జీజీహెచ్‌లో శాశ్వత మెడికల్ కాలేజీ భవనం, వైద్య విద్యార్థుల హాస్టల్ భవనాల నిర్మాణ పనులను 2023 జనవరిలో ప్రారంభించారు. ఈ భవనాలను యుద్ధప్రాతిపదికన 2024 సెప్టెంబర్ కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024 జూన్ 4 నాటి వరకూ పనులు శరవేగంగా సాగాయి.

జగన్ హయాంలోనే సాకారం