
ఇళ్ల నిర్మాణాలకు రగహణం
పైసా ఇచ్చే పరిస్థితులు లేవు
ఏలూరు (మెట్రో): అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ప్రగల్భాలు పలికి గద్దెనెక్కిన కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాటను మూలకు నెట్టేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షలు ఇస్తామని ప్రకటించిన కూటమి పెద్దలు గద్దెనెక్కిన తరువాత వాటిని మర్చిపోగా పేద ప్రజలు మాత్రం పెద్దల మాటలు ఎప్పుడు నెరవేరతాయా? అని ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కోటలు దాటాయి. వాటిని అమలు చేయడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన పాపాన పోవడం లేదు. పేదల ఇళ్ల స్థలాలు, దీనిలోనూ పేదలు గృహనిర్మాణాలు చేసుకునేందుకు రూ.4 లక్షలు ఇస్తామని చెప్పిన మాటలు మాత్రం నీటి మూటలుగానే మిగిలిపోయాయి. అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త ఇల్లు మంజూరు మాట అటుంచితే గతంలో నిర్మాణాలు వివిధ దశల్లో నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేయడానికి కూడా కూటమి సర్కారు ముందడుగు వేయడం లేదు.
గతమెంతో ఘనం
పేదవాడు అద్దె ఇంట్లో ఉండకూడదనే ఉద్ధేశంతో ప్రతి ఒక్క పేదవాడు సొంతింటి కలను నెరవేర్చుకోవాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా లేఅవుట్లలో 1,02,240 ఇళ్లను మంజూరు చేయించింది. మంజూరు చేయడమే కాకుండా వాటికి మొదటి ప్రాధాన్యత కల్పించి నిర్మాణాలు చేపట్టి 2024 జూన్ నాటికి 44,618 నిర్మాణాలు పూర్తి చేయించింది. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రూ.1.80 లక్షల చొప్పున చెల్లించి ప్రతి ఒక్కరికీ సొంతింటి కల సాకారం చేసేందుకు చర్యలు తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా రూ.917.92 కోట్ల గృహనిర్మాణాలకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది.
పాత వాటి పట్టింపు లేదు
జిల్లా వ్యాప్తంగా మంజూరైన గృహాలలో ఇంకా ప్రారంభమే కాని గృహాలు 18,758 ఉండగా, పునాదుల స్థాయిలోనే 21,436 గృహాలు నిలిచిపోయాయి. పునాదులు పైకి 9,946 గృహాలు, గోడలు పూర్తి చేసుకుని 4,241, శ్లాబ్ స్థాయికి 2,742, శ్లాబ్ పూర్తి చేసుకుని 498 గృహాలు ఉన్నాయి. ఇలా వివిధ దశల్లో నిలిచిపోయిన గృహాలను సైతం కూటమి సర్కారు గత సర్కారుపై ఉన్న కక్షతో పట్టించుకోవడమే మానేసింది.
కొత్త వాటి ఊసు లేదు
జిల్లా వ్యాప్తంగా ఇళ్ల మంజూరు కోసం గృహ నిర్మాణ శాఖకు దరఖాస్తులు క్యూలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 26,318 మంది నూతన గృహాలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు మాత్రం తమ తప్పు లేకుండా వారి పని పూర్తి చేసి వచ్చిన దరఖాస్తులపై నివేదికలు సైతం సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి మాత్రం మంజూరుకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఆ నివేదికలు మాత్రం నివేదికలుగానే మిగిలిపోతున్నాయి.
ప్రస్తుతం గృహనిర్మాణాలపై దృష్టి కేంద్రీకరించని సర్కారు గృహాలపై పైసా కూడా విదిల్చే పరిస్థితులు కనుచూపు మేరలో కానరావడం లేదు. కొత్తగా పేదల నుంచి అందిన దరఖాస్తులకు కేంద్రమే ఇళ్లను మంజూరు చేయాల్సి ఉంది. పేదల ఇళ్ల నిర్మాణాలను పీఎంఎవై పథకం ద్వారా చేపట్టి చేతులు దులుపుకునే పనిలో కూటమి సర్కారు నిమగ్నమైంది.
కొత్త వాటి ఊసు లేదు.. పాతవాటికి మోక్షం కలగదు
అటకెక్కిన చంద్రబాబు రూ.4 లక్షల హామీ
గతంలో 1.02 లక్షల ఇళ్లు మంజూరు చేసిన వైఎస్సార్‌సీపీ సర్కారు
జగన్ హయాంలో రూ.917 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం
గత 15 నెలల్లో పైసా విదల్చని కూటమి సర్కారు