
రక్తపు మడుగులో బాలుడు
ఏలూరు టౌన్: ఏలూరు శివారు కలపర్రు జాతీయ రహదారికి వెళ్ళే ప్రధాన రహదారిపై పొలాల్లో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని గుర్తించిన సమీపంలోని రైతు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆ బాలుడిని అంబులెన్స్‌లో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాలుడు అపస్మారక స్థితిలో ఉండడంతో వివరాలు తెలియవని పోలీసులు చెబుతున్నారు. బిఆలుడి తల, చెవుల పక్కన తీవ్ర గాయాలున్నాయి. కత్తితో, పదునైన చాకుతో పొడిచి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఏకంగా పదికి పైగా కత్తిపోట్లు ఉన్నాయని చెబుతున్నారు. బాలుడి వయసు 14 నుంచి 15 ఏళ్లు ఉంటుందని, ఖాకీ రంగు నిక్కరు, ఎరుపు టీషర్ట్ వేసుకుని ఉన్నాడనీ, వివరాలు తెలిస్తే.. 9440796637 నెంబరులో సంప్రదించాలని కోరారు. ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, పెదవేగి సీఐ రాజశేఖర్, పెదపాడు ఎస్‌ఐ సంఘటనా స్థలంలో పరిస్థితులను పరిశీలించారు. ఎవరైనా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొచ్చి కత్తితో పొడిచి పారిపోయారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.