
విద్యుత్ ఉద్యోగుల ధర్నా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యుత్ ఉద్యోగుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా రెండో విడత బుధవారం రామచంద్రరావుపేట విద్యుత్ భవన్‌లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో అమలులో ఉన్న జీపీఎఫ్‌తో కూడిన పెన్షన్ నిబంధనలను 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 వరకు నియమించిన ఉద్యోగులందరికీ వర్తింపజేయాలన్నారు. భవిష్యత్తుపై ఎంతో ఆశతో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్, అవుట్ సోర్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డిస్కమ్ నాయకులు తురగా రామకృష్ణ, భూక్యా నాగేశ్వరరావు, జిల్లా నాయకులు ఎం.రమేష్, వీ.రాము, అబ్బాస్ పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.