
మహిళా కండక్టర్ ఆవేదన
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న వై.కుసుమకుమారి మహిళలకు ఉచిత బస్సు పథకంపై స్పందిస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాము పడుతున్న ఇబ్బందులు, బాధలను వివరిస్తూ ఆర్టీసీ ఉన్నతాధికారులకు వీడియో పంపినట్టు ఆమె పేర్కొన్నారు. ఆ వీడియోలో ఏముందంటే.. ‘ఆర్టీసీ ఉన్నతాధికారులకు మా మనవి.. మీకో వీడియో పెడుతున్నాను చూడండి. పరిమితికి మించి 150 నుంచి 170 మంది బస్సు ఎక్కుతున్నారు. చాలా రెక్‌లెస్‌గా ఉన్నారు. డోర్‌లో ప్రమాదకరంగా నిలబడుతున్నారు.. డోర్ వద్ద నిలబడొద్దు.. పైకి ఎక్కమంటే కండక్టర్‌పై ఎదురు తిరుగుతున్నారు.. ఉద్యోగాలు చేయలేకపోతున్నాం.. ఎందుకు సర్, మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు.. అధికారులకు మా సేవల పట్ల కనీస జాలి, దయ లేదు.. పారిశుధ్య కార్మికుల కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగం.. కిక్కిరిసిన జనాలతో మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలా ఉంది.. బస్సులో కొట్టుకోవడం, కండక్టర్‌పై తిరగబడటం, గొర్రెలా అరుస్తున్నా పైకి ఎక్కకపోవడం, ఏంటండి ఇది మాకు.. మీరిచ్చే జీతాల కన్నా ఎక్కువ కష్టపడుతున్నాం.. అయినా సరే సరైన రక్షణ, మా సేవల పట్ల గుర్తింపు లేకుండా పోయింది..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి కండక్టర్ ఆవేదనపై ప్రభుత్వం, అధికారులు స్పందన ఎలా ఉంటుందనేది వేచిచూడాలి.