
ఉచితం.. అవస్థల ప్రయాణం!
తోపులాటలు.. కొట్లాటలు
ప్రముఖ క్షేత్రంలో బస్సుల కోసం ఇన్ని ఇబ్బందులు పడాలా? మరీ ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు. రెండు గంటల నుంచి రాజమండ్రి బస్సు కోసం బస్టాండ్‌లో వేచి ఉన్నాం. కనీసం భీమడోలు వరకు అయినా వెళదామంటే బస్సు ఎక్కడానికి వీలు లేకుండా ఉంది.
– కుడిపూడి సత్యనారాయణ, భక్తుడు, రాజమహేంద్రవరం
శనివారం భక్తులు ఎక్కువగా ఉంటారని ఆర్టీసీ అధికారులకు తెలియదా? రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు బస్సు సర్వీసులను పెంచాలి కదా. గంటకో బస్సు వస్తోంది. అది ఎక్కేందుకు వందల మంది పోటీ పడుతున్నారు. క్షేత్రంలో ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడూ ఎదుర్కోలేదు.
– వేగి వీరమ్మ, భక్తురాలు, పాలకొల్లు
బస్సులు నడపలేనప్పుడు ఉచిత బస్సు పథకం ఎందుకు పెట్టారు? మహిళలను ఇబ్బంది పెట్టడానికా? శ్రీవారి దర్శనార్థం యానాం నుంచి వచ్చాం. తిరిగి వెళ్లేందుకు బస్సులు లేవు. పిల్లలు, దివ్యాంగులు, వృద్ధులతో ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఉచిత బస్సులను తీసేసి, పూర్తి స్థాయిలో బస్సులను నడపండి.
– జిత్తుగ శ్రీదేవి, భక్తురాలు, యానాం
నేను దివ్యాంగుడిని. నా తల్లి సాయంతో వచ్చి శ్రీవారిని దర్శించుకున్నాను. బస్టాండుకు వస్తే జనంతో నిండిపోయింది. నాలాంటి వారు బస్సు ఎలా ఎక్కాలి?
– ప్రవీణ్‌కుమార్, దివ్యాంగ భక్తుడు, ఉయ్యూరు
ద్వారకాతిరుమల: ఓ వైపు చాలీచాలని బస్సులు.. మరో వైపు ఇళ్లకు చేరుకోవాల్సిన భక్తులు.. ఏం చేయాలో పాలుపోక వృద్ధులు, చంటి పిల్లలు, దివ్యాంగులతో బస్టాండ్‌లో గంటల తరబడి పడిగాపులు.. ఇదీ ద్వారకాతిరుమలలోని శ్రీవారి భక్తుల దీన స్థితి. ఈ దుస్థితికి ఉచిత బస్సు ప్రయాణాలే కారణమని కొందరు మహిళా భక్తులు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. చిన్న తిరుపతి క్షేత్రాన్ని శనివారం వేలాది మంది భక్తులు దర్శించారు. అనంతరం తిరిగి బస్సుల్లో స్వగ్రామాలకు చేరుకునేందుకు వారంతా బస్టాండ్‌కు చేరుకున్నారు. భక్తుల రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో బస్టాండ్ మొత్తం యాత్రికులతో నిండిపోయింది. దానికి తోడు మధ్యాహ్నం వర్షం కురవడంతో నిలవడానికి చోటు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
బస్సులే లేవు.. ఉచిత బస్సు ఏమిటి?
ఉచిత బస్సు ప్రయాణం వల్లే ఇబ్బందులు ఏర్పడ్డాయని మహిళా భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము గతంలో శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు తిరుగు ప్రయాణంలో ఇన్ని ఇబ్బందులు ఎప్పుడూ పడలేదని, ప్రస్తుత పరిస్థితికి ఉచిత ప్రయాణాలే కారణమని అన్నారు. బస్సులు తక్కువగా వస్తుండటంతో, వచ్చిన వాటిలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారని, దీంతో అవి పక్కకు ఒరిగిపోతున్నాయని విమర్శించారు. గుడి సెంటర్‌లో బస్సులు ఆపకపోవడం వల్ల బస్టాండుకు వచ్చామని, కానీ ఇక్కడ అసలు నిలబడడానికి కూడా దారిలేదని వాపోయారు.
పునరుద్ధరించని బస్సు సర్వీసులు
భీమవరం, నరసాపురం ఆర్టీసీ డిపోలు ద్వారకాతిరుమలకు పలు బస్సు సర్వీసులను రద్దు చేశాయి. దానికి తోడు చాలీచాలని బస్సుల కారణంగా యాత్రికులు పడుతున్న ఇబ్బందులపై సాక్షి దినపత్రికలో గతనెల 31న ‘ఉచిత బస్సు.. ప్రయాణం తుస్సు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఏలూరు ప్రజారవాణా శాఖ అధికారి ఎస్‌కే షబ్నం భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచుతామని, రద్దయిన సర్వీసులను త్వరలో పునరుద్ధరిస్తామని తెలిపారు. కానీ ఇప్పటివరకు అవి అమలు కాలేదు.
ద్వారకాతిరుమల క్షేత్రంలో యాత్రికులకు ప్రయాణ కష్టాలు
చాలీచాలని బస్సులు.. భక్తుల కొట్లాటలు
ఉచిత బస్సుల్లో రద్దీ ఇబ్బందులు
బస్సుల ద్వారాల వద్ద నిలబడి ప్రమాదకర ప్రయాణాలు
బస్సు ఎక్కే సమయంలో యాత్రికులు తోపులాటకు దిగి ఒకానొక దశలో కొట్లాటలకు దిగారు. దీంతో బస్టాండ్‌లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బస్టాండ్‌లో ఇదే పరిస్థితి కొనసాగింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి యాత్రికులను నియంత్రించే ప్రయత్నం చేశారు. పోలీసులను సైతం లెక్కచేయలేదు. దాదాపు అన్ని బస్సుల్లోనూ ద్వారాల వద్ద నిలబడే యాత్రికులు ప్రయాణాలు సాగించారు. ఈ ప్రమాదకర ప్రయాణాలు తోటి యాత్రికులను ఆందోళనకు గురిచేశాయి.

ఉచితం.. అవస్థల ప్రయాణం!

ఉచితం.. అవస్థల ప్రయాణం!

ఉచితం.. అవస్థల ప్రయాణం!

ఉచితం.. అవస్థల ప్రయాణం!

ఉచితం.. అవస్థల ప్రయాణం!

ఉచితం.. అవస్థల ప్రయాణం!

ఉచితం.. అవస్థల ప్రయాణం!

ఉచితం.. అవస్థల ప్రయాణం!