
పత్రికా స్వేచ్ఛను హరించడమే
భీమవరం: సాక్షి దినపత్రికపై ఉద్దేశ్య పూర్వకంగా కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందరకుమార్ అన్నారు. భీమవరం పట్టణం ప్రకాశంచౌక్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన ఐక్య వేదిక ముఖ్యనాయకులు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల పక్షాన ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను సాక్షి పత్రికలో ప్రచురించడాన్ని జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని దీనిలో భాగంగానే సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టారని దీనికి దళిత ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తునట్లు చెప్పారు. ఈ సమావేశంలో గొల్ల రాజ్‌కుమార్, ఆలమూరి బాబ్జి, తుళ్లూరి చంటి, పట్టెం శుభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈ నెల 16, 17 తేదీల్లో ఏలూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అండర్–14, అండర్–17 బాలబాలికల క్రీడా జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్టు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కే అలివేలు మంగ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ నెల 16న అండర్–17 బాలబాలికల వెయిట్ లిఫ్టింగ్ జట్ల ఎంపిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జరుగుతుందన్నారు. అండర్–14, 17 బాలబాలికల స్విమ్మింగ్ జట్ల ఎంపికలు అల్లూరి సీతారామ రాజు స్విమ్మింగ్ పూల్‌లో, అండర్–14, 17 కరాటే జట్ల ఎంపికలు స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ ప్రాంగణంలో జరుగుతాయన్నారు. అండర్–14 జట్లకు వచ్చే విద్యార్థులు 2012 జనవరి 1న కానీ ఆ తరువాత కానీ పుట్టి ఉండాలన్నారు. అండర్–17 జట్ల ఎంపికకు 2009 జనవరి 1న కానీ ఆ తరువాత పుట్టి ఉండాల న్నారు. ఇతర వివరాలకు 9030894311 నెంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.